టైటిల్: ఉత్సవం
నటీనటులు:దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా, ప్రకాష్ రాజ్, నాజర్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, అలీ, ప్రేమ, ఎల్.బి. శ్రీరామ్, అనీష్ కురువిల్లా, ప్రియదర్శి, ఆమని, సుధ తదితరులు
నిర్మాత: సురేష్ పాటిల్
రచన, దర్శకత్వం: అర్జున్ సాయి
సంగీతం: అనూప్ రూరబెన్స్
సినిమాటోగ్రఫీ: రసూల్ ఎల్లోర్
విడుదల తేది: సెప్టెంబర్ 13, 2024
కథేంటంటే..
అభిమన్యు నారాయణ(ప్రకాశ్ రాజ్).. అంతరించి పోయిన సురభి నాటక మండలిలో ప్రసిద్ధి చెందిన కళాకారుడు. అతని కొడుకు కృష్ణ(దిలీప్ ప్రకాశ్)కి కూడా నాటక కళాకారులు అంటే చాలా గౌరవం. అంతరించిపోతున్న నాటక కళాకారుల గొప్పదనాన్ని నేటి ప్రపంచానికి తెలియజేసి, వాళ్ల కష్టాలను గట్టేకించాలని ప్రయత్నిస్తుంటాడు. మరో రంగస్థల నటుడు మహాదేవ్ నాయుడు(నాజర్) కూతురు రమ(రెజీనా) సహాయంతో కార్పొరేట్ వీకెంట్ ఈవెంట్‌లో రంగస్థల నటులతో నాటక ప్రదర్శనను ఏర్పాటు చేస్తాడు. ఈ క్రమంలో రమ-కృష్ణలు ప్రేమలో పడతారు.అయితే ఇద్దరి మధ్య కొన్ని మనస్పర్థలు రావడంతో విడిపోతారు. మరోవైపు స్నేహితులైన అభిమన్యు, మహాదేవ్‌లు కృష్ణ, రమలకు పెళ్లి చేయాలని ఫిక్సవుతారు.
అయితే ఈ విషయం తెలియకుండా ఇద్దరు పెళ్లికి ఒప్పుకుంటారు. తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి రమనే అని కృష్ణకు, పెళ్లి కొడుకు కృష్ణనే అని రమకు తెలియదు. మరికొద్ది గంటల్లో పెళ్లి అనగా ఒకరికి తెలియకుండా ఒకరు ఇంట్లో నుంచి పారిపోతారు.అయితే ఈ విషయాన్ని అటు పెళ్లికొడుకు వాళ్లు, ఇటు పెళ్లి కూతురు వాళ్లు ఇద్దరు ఒకరికి తెలియకుండా మరొకరు దాచి..పెళ్లి సమయానికల్లా వాళ్లను వెతికి తీసుకురావాలని ప్రయత్నిస్తుంటారు. అసలు రమ-కృష్ణలు ప్రేమలో ఎలా పడ్డారు? విడిపోవాడానికి గల కారణం ఏంటి? పెద్దలు ఫిక్స్ చేసిన సంబంధం కూడా ఇదేనని ఇద్దరికి ఎప్పుడు తెలిసింది? ఆ తర్వాత ఏం జరిగింది? చివరకు రమ-కృష్ణలు ఎలా ఒకటయ్యారు అనేదే మిగతా కథ.
ఎలా ఉందంటే..
సినిమాలకు స్పూర్తి నాటకాలు. ఆ నాటక కళాకారుల మీద తీసిన సినిమానే ‘ఉత్సవం’. ఒకవైపు రంగస్థల కళాకారులు కష్టాలను చూపిస్తూనే ఓ చక్కని ప్రేమకథను చెప్పొకొచ్చాడు దర్శకుడు అర్జున్ సాయి. డైరెక్టర్ రాసుకున్న పాయింట్ బాగున్నా..దాన్నితెరపై చూపించడంలో మాత్రం కాస్త తడబడ్డాడు. స్క్రీన్‌ప్లేని బలంగా రాసుకోలేకపోయాడు. ఒకదానికొకటి సంబంధం లేని సన్నివేశాలు వస్తుంటాయి. అలాగే ఎమోషనల్ సీన్లు కూడా అంతగా ఆకట్టుకోలేకపోయాయి. కొన్ని సన్నివేశాలు గతంలో వచ్చిన కృష్ణం వందే జగద్గురుం, ఈ మధ్యే వచ్చిన రంగమార్తండా సినిమాలను గుర్త చేస్తాయి. హీరోహీరోయిన్ల లవ్‌స్టోరీ కొంతమేర ఆకట్టుకుంటుంది.
(చదవండి: మత్తు వదలరా 2 మూవీ రివ్యూ)
ఫస్టాఫ్‌లోహీరో హీరోయిన్ల ప్రేమాయణంతో పాటు నాటక కళాకారులు కష్టాలను చూపించారు. ఇక సెకండాఫ్‌లో నాటకాలకు పూర్వ వైభవం తీసుకురావడానికి హీరో చేసే ప్రయత్నం.. అలాగే వారిద్దరు విడిపోవడానికి గల కారణం ఏంటో చూపించారు. ‘దక్ష యజ్ఞం’ ఎపిసోడ్ సినిమాకే హైలెట్. ఆ తర్వాత వచ్చే కొన్ని సన్నివేశాలను కథను సాగదీసినట్లుగా అనిపిస్తుంది. క్లైమాక్స్ ఊహించినట్లే రొటీన్‌గా ఉంటుంది.
ఎవరెలా చేశారంటే..
దిలీప్ ప్రకాష్‌కి ఇది రెండో సినిమా . అయినా ఎంతో అనుభవం ఉన్నవాడిలా నటించాడు. ఎమోషనల్ సన్నివేశాల్లో అదరగొట్టేశాడు. తండ్రికి విలువనిచ్చే కొడుకుగా, ఓ మంచి ప్రేమికుడిగా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక రమ పాత్రలో రెజీనా ఒదిగిపోయింది. తెరపై అందంగా కనిపించింది. ఇక హీరో తండ్రి, రంగస్థల నటుడు అభిమన్యు నారాయణగా ప్రకాశ్ రాజు జీవించేశాడు.
‘దక్ష యజ్ఞం’ ఎపిసోడ్‌లో శివుడి అవతారంలో కనిపించి.. తనదైన సంభాషణలతో ఆకట్టుకున్నాడు. మరో నాటక కళాకారుడు మహాదేవ్‌గా నాజర్ కూడా అదరగొట్టేశాడు. , రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, అలీ, ప్రేమ, ఎల్.బి. శ్రీరామ్‌తో పాటు ప్రతి ఒక్కరు తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. అనూప్ సంగీతం ఈ సినిమాకు ప్లస్ పాయింట్. మంచి పాటలతో పాటు చక్కటి నేపథ్య సంగీతాన్ని అందించాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment