నటుడు ఉదయనిధి స్టాలిన్, నటి కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం మామన్నన్. రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి పరియేరుమ్ పెరుమాళ్, కర్ణన్ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన మారి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్న ఇందులో నటుడు ఫాహత్ ఫాజిల్, వడివేలు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.
ఈ చిత్రాన్ని జూన్ నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కాగా ఇప్పటివరకు హాస్య పాత్రల్లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన వడివేలు మామన్నన్ చిత్రంలో ఉదయనిధి స్టాలిన్‌కు తండ్రిగా సీరియస్ పాత్రలో నటించడం విశేషం. ఇటీవల ఉదయనిధి స్టాలిన్, వడివేలు కలిసున్న ఫొటోతో కూడిన చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఇటీవల విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చిందని చిత్ర వర్గాలు పేర్కొన్నాయి.
ఇకపోతే ఈ చిత్రం కోసం ఏఆర్ రెహమాన్ బాణీలు కట్టిన ఒక పాటను నటుడు వడివేలుతో పాడించినట్లు సమాచారం. ఈ పాట రికార్డింగ్ సమయంలో వడివేలు, చిత్ర దర్శకుడు మారి సెల్వరాజ్ తదితరులు ఏఆర్ రెహమాన్‌తో కూర్చుని ఉన్న ఫొటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అదేవిధంగా ప్రస్తుతం తమిళనాడులో మంత్రిగా రాజకీయాల్లో బిజీగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ కథానాయకుడిగా నటించిన చివరి చిత్రం కావడంతో మామన్నన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment