
‘‘ఎవరు ఎలా ఉంటే వాళ్లను అలాగే అంగీకరిద్దాం. వేరే వారితో పోల్చి చూడటం మానేద్దాం’’ అంటున్నారు తమిళ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్. సామాజిక అంశాల మీద తరచూ ఏదో ఓ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఉంటారామె. తాజాగా పాతకాలపు ఆలోచనా విధానాన్ని ఎలా బద్ధలుకొట్టాలి? స్త్రీలకు అండగా ఎలా నిలబడటం ఎంత ముఖ్యం? అనే విషయాలపై ఓ పోస్ట్ చేశారు వరలక్ష్మి. ‘‘ఒక స్త్రీ ఎలా ఉండాలనుకుంటుందో అది తన ఇష్టం. ఒక సమాజంగా తన ఇష్టాన్ని మనందరం గౌరవించాలి.
నువ్వెందుకు ఇలా ఉన్నావు? మిగతావారిలా లేవు? అని పోల్చి చూడొద్దు. ప్రతీ ఒక్కరం ఏదో ఒక సమస్యతో నిరంతరం పోరాడుతూనే ఉంటాం. సమస్యను అనుభవించే వాళ్లకే ఆ నొప్పి తెలుస్తుంది. ఒకరికొకరం నిలబడదాం.. తోడుగా నిలబడదాం. మనలో ఎవ్వరూ సంపూర్ణంగా లేము. మనకి ఉన్నది ఒక్కటే జీవితం. నచ్చినట్టు బతుకుదాం.. నచ్చిన పనిని నచ్చినట్టు చేసుకుంటున్న ప్రతి స్త్రీకి నా అభినందనలు’’ అన్నారామె. కాగా వరలక్ష్మి సినిమాల విషయానికి వస్తే రవితేజ ‘క్రాక్’, అల్లరి నరేశ్ ‘నాంది’ సినిమాల్లో నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment