టైటిల్: వీరసింహారెడ్డి
నటీనటులు: బాలకృష్ణ, శ్రుతిహాసన్, హనీరోజ్, వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్, నవీన్‌చంద్ర మురళీశర్మ,తదితరులు
నిర్మాణ సంస్థ : మైత్రీ మూవీ మేకర్స్
నిర్మాతలు : నవీన్ యెర్నేని, వై రవిశంకర్
దర్శకత్వం : గోపిచంద్ మలినేని
సంగీతం: తమన్
సినిమాటోగ్రఫీ: రిషి పంజాబీ
ఎడిటర్: నవీన్ నూలి
విడుదల తేది: జనవరి 12, 2023
అఖండ’లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ‘వీరసింహారెడ్డి’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య గురువారం(జనవరి 12) విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం.
‘వీరసింహారెడ్డి’ కథేంటంటే..
జై అలియాస్ జైసింహారెడ్డి(బాలకృష్ణ) తన తల్లి మీనాక్షి(హనీరోజ్)తో కలిసి ఇస్తాంబుల్‌లో ఉంటాడు. అతనికి అక్కడే తెలుగమ్మాయి ఈషా(శ్రుతీహాసన్)పరిచయం అవుతుంది. వీరద్దరు ప్రేమించుకుంటారు. ఈ విషయాన్ని ఈషా తన తండ్రి(మురళీ శర్మ)కి చెబుతుంది. పెళ్లి సంబంధం కుదుర్చుకోవడం కోసం జై తల్లిదండ్రులను ఇంటికి ఆహ్వానిస్తారు. అయితే అప్పటి వరకు తండ్రి లేడనుకున్న జైకి తల్లి ఓ నిజం చెబుతుంది. అతనికి తండ్రి ఉన్నాడని, పేరు వీరసింహారెడ్డి(బాలకృష్ణ) అని, రాయలసీమపై ప్రేమతో అక్కడి ప్రజలకు అండగా ఉన్నాడని చెబుతుంది.
పెళ్లి సంబంధం మాట్లాడుకోవడానికి ఇస్తాంబుల్ రావాల్సిందిగా వీరసింహారెడ్డికి కబురు పంపుతుంది. కొడుకు పెళ్లి కోసమై వీరసింహారెడ్డి ఇస్తాంబుల్ వస్తాడు. ఇదే అదునుగా భావించిన ప్రతాప్‌రెడ్డి(దునియా విజయ్), వీరసింహారెడ్డి చెల్లెలు భానుమతి(వరలక్ష్మీ శరత్ కుమార్) అతన్ని చంపడానికి ప్లాన్ వేస్తారు. సొంత చెల్లెలే వీరసింహారెడ్డిని చంపాలని ఎందుకు పగ పట్టింది? ప్రతాప్‌రెడ్డికి వీరసింహారెడ్డికి మధ్య ఉన్న వైరం ఏంటి? మీనాక్షి, వీరసింహారెడ్డిలు దూరంగా ఉండడానికి గల కారణం ఏంటి? తండ్రి ప్లాష్‌బ్యాక్ తెలిసిన తర్వాత జైసింహారెడ్డి ఏం చేశాడు? అనేదే మిగతా కథ.
ఎలా ఉందంటే..
ఫ్యాక్షన్ సినిమాలు టాలీవుడ్ ప్రేక్షకులకు కొత్తేమి కాదు. అందులో బాలయ్యకు మరీనూ. వీరసింహారెడ్డి కూడా ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమే. ఇందుతో కొత్త విషయం ఏంటంటే.. ఫ్యాక్షన్ స్టోరీకి సిస్టర్ సెంటిమెంట్‌ని జోడించడం. అయితే తెరపై అనుకున్నంతగా వర్కౌట్ కాలేదనే చెప్పాలి.
పుట్టి పెరిగిన ఊరి కోసం ఓ వ్యక్తి కత్తి పట్టడం.. అతన్ని ప్రజలు దేవుడిగా ఆరాధించండం.. అదేసమయంలో మరో గ్యాంగ్ అతన్ని చంపడానికి ప్రయత్నించడం.. ఓ ఫ్లాష్‌బ్యాక్.. ఇదే వీరసింహారెడ్డి కథ. అయితే అతన్ని చంపే గ్యాంగ్‌లో చెల్లెలు కూడా ఉండడంతో కథపై కాస్త ఆసక్తి కలుగుతుంది. కానీ తెరపై వచ్చే సన్నివేశాలు మాత్రం ఆ ఆసక్తిని తగ్గిస్తాయి. ఫస్టాఫ్‌లో కథ ఏమీ ఉండడు. ప్రతిసారి విలన్ గ్యాంగ్ వీరసింహారెడ్డిపై దాడికి ప్రయత్నించడం.. చివరకు అతని చేతిలో తన్నులు తిని బయటకు రావడం..ఇలాగే సాగుతుంది. మధ్య మధ్యలో ఒకటిరెండు డైలాగ్స్. దర్శకుడు హీరోయిజం మీద పెట్టిన దృష్టి కథపై పెట్టలేదనిపిస్తుంది. అయితే ఫస్టాఫ్‌లో వచ్చే ఫైట్ సీన్స్ అలరిస్తాయి. ఇంటర్వెల్ సీన్ బాగుంటుంది.
ఇక సెకండాఫ్‌లో యాక్షన్ కంటే సిస్టర్ సెంటిమెంట్ మీదే ఎక్కువ దృష్టిపెట్టారు. బాలకృష్ణ, వరలక్ష్మీ షరత్ కుమార్‌ల మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. వీరసింహారెడ్డిపై చెల్లెలు ఎందుకు పగ పెంచుకుంది? శేఖర్(నవీన్‌చంద్ర) ఎవరు? మీనాక్షి, వీరసింహారెడ్డి ఎందుకు దూరంగా ఉన్నారనేది సెకండాఫ్‌లో చూపించారు. క్లైమాక్స్ రొటీన్‌గా ఉంటుంది. విపరీతమైన హింసకు తావిచ్చేరనే అభిప్రాయం సగటు ప్రేక్షకుడికి కలుగుతుంది. పోరాట ఘట్టాలు, డైలాగ్స్‌తోనే సినిమాను లాక్కొచ్చాడు దర్శకుడు. అయితే నందమూరి అభిమానులకు మాత్రం ఈ చిత్రం శాటిస్‌ఫై చేస్తుంది.
ఎవరెలా చేశారంటే..
మరోసారి బాలకృష్ణ తనదైన నటనతో విజృంభించాడు. గ్రామ పెద్ద వీరసింహారెడ్డిగా, అతని కొడుకు జైసింహారెడ్డిగా రెండు విభిన్న పాత్రలో కనిపించిన బాలయ్య.. ప్రతి పాత్రలోనూ వేరియేషన్ చూపించి ఆకట్టుకున్నాడు. శ్రుతీహాసన్ పాత్రకు అంత ప్రాధాన్యత లేదు. రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ రోల్ తనది. అయితే పాటల్లో మాత్రం బాలయ్యతో హుషారుగా స్టెప్పులేసి అలరించింది.
మీనాక్షి పాత్రకి హనీరోజ్ న్యాయం చేసింది. వీరసింహారెడ్డి చెల్లెలు భానుమతిగా వరలక్ష్మీ శరత్ కుమార్ తనదైన నటనతో ఆకట్టుకుంది. అయితే డబ్బింగ్ ఆమెతో కాకుండా మరొకరితో చెప్పిస్తే బాగుండేదేమో. ప్రతాప్‌రెడ్డిగా దునియా విజయ్ విలనిజాన్ని బానే పండించాడు. బ్రహ్మానందం, అలీ పాత్రలు ఇలా వచ్చి అలా వెళ్లిపోతాయి. లాల్, నవీన్ చంద్ర, ఈశ్వరీ రావు, మురళీ శర్మ, అజయ్ ఘోష్ తదితరుతు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. తమన్ నేపథ్య సంగీతం బాగుంది. రామ్ లక్ష్మణ్ పోరాట ఘట్టాలు సినిమాకు ప్లస్. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువల సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment