
‘పూర్వ జన్మ జ్ఞానంతో మళ్లీ జన్మ ఎత్తే అవకాశం ఏ జీవికి కూడా ఉండదు.. దెయ్యాలకు మాత్రమే ఉంటుంది’ అనే డైలాగ్‌తో ‘ఓఎమ్‌జీ’ (ఓ మంచి ఘోస్ట్) చిత్రం టీజర్ ఆరంభమవుతుంది. ‘ఒసేయ్ నువ్వు అరుంధతికి అక్కవైనా.. చంద్రముఖి చెల్లివైనా.. కాశ్మోరా లవర్‌వైనా, కాంచన కజిన్‌వైనా..’ అంటూ వెన్నెల కిశోర్ చేసే కామెడీ, ‘నేను మోహిని పిశాచి మోహం తీర్చా.. కామిని పిశాచి కామం తీర్చా’ అంటూ షకలక శంకర్ చేసే కామెడీతో ఈ టీజర్ సాగుతుంది.
ఘోస్ట్ క్యారెక్టర్‌లో నందితా శ్వేతా అందరినీ భయపెట్టేలా కనిపించారు. హారర్, కామెడీ ప్రధానాంశాలుగా రూపొందిన చిత్రం ‘ఓఎమ్‌జీ’. వెన్నెల కిశోర్, నందితా శ్వేత, షకలక శంకర్, నవమీ గాయక్, నవీన్ నేని, రజత్ రాఘవ్, రఘుబాబు కీలక పాత్రల్లో శంకర్ మార్తాండ్ దర్శకత్వం వహించారు. డా. అబినికా ఇనాబతుని నిర్మించారు. శనివారం ఈ చిత్రం టీజర్‌ని విడుదల చేశారు. ‘‘త్వరలో ‘ఓఎమ్‌జీ’ విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది.