బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సామ్ బహదూర్. భారతీయ మొట్ట మొదటి ఫీల్డ్ మార్షల్ సామ్ మానెక్‌షా జీవితకథ ఆధారంగా ఈ బయోపిక్ తెరకెక్కింది. మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ నుంచి తాజాగా టీజర్ విడుదలైంది. 'యుద్ధంలో చనిపోవడమే సైనికుడి పని అని ఇందిరా గాంధీ అంటే.. ప్రత్యర్థి వైపున్న జవాన్లను అంతమొందించడమే సైనికుడి అసలైన కర్తవ్యం', 'నాకు రాజకీయాలంటే ఆసక్తి లేదు, ఆర్మీయే నా ప్రాణం' అని విక్కీ కౌశల్ చెప్పిన డైలాగులు సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి.
1971లో జరిగిన ఇండో-పాక్ యుద్ధానికి సామ్ మానెక్‌షా ఏ విధంగా సారథ్యం వహించారు? సైనికులకు ఎలాంటి శిక్షణ అందించాడనేది ఈ చిత్రంలో చూపించారు. తాజాగా విక్కీ కౌశల్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. 'సామ్ మానెక్‌షా అని రాసి ఉన్న ఆర్మీ యునిఫామ్ ధరించడమే పెద్ద బాధ్యత. ఈ విషయంలో నేను ఏడీజీపీఐ(అడిషనల్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పబ్లిక్ ఇన్‌ఫర్మేషన్)కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. వారిని కలిసినప్పుడల్లా ఈ పాత్రను సమర్థవంతంగా పోషించాలని చెప్పేవారు.
కాబట్టి సినిమా చేస్తున్నంతసేపూ ఆ ఒత్తిడి నాపై ఉంది. నాకు సాధ్యమైనంతవరకు బాగా చేయడానికే ప్రయత్నించాను. చిత్రయూనిట్ అంతా కష్టపడ్డాం. నిజానికి సామ్ యుక్తవయసులో ఎలా ఉన్నాడో తెలుసుకునేందుకు అతడి మనవడిని అనేకసార్లు కలిశాం. చాలా విషయాలు అడిగి తెలుసుకున్నాం. దీనిద్వారా ఆయన మాట్లాడే తీరు, నడకతీరు తెలుసుకుని దాన్ని అమలు చేసేందుకు ప్రయత్నించాను' అని చెప్పుకొచ్చాడు. ఈ మూవీ డిసెంబర్ 1న రిలీజ్ కానుంది.
చదవండి: బిగ్‌బాస్ షాకింగ్ నిర్ణయం.. కంటెస్టెంట్ల చేతికి మొబైల్ ఫోన్స్!
Comments
Please login to add a commentAdd a comment