సాక్షి, చెన్నై: తన కుమారుడితో తనకు ఎలాంటి విభేదాలు లేవని తమిళ స్టార్ హీరో, ఇళయ దళపతి విజయ్ తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. రాజకీయ పార్టీతో తన పేరు ముడిపెట్టవద్దన్న విజయ్ వ్యాఖ్యలపై తననే సంప్రదించాలని మీడియాకు సూచించారు. కాగా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ‘ఆలిండియా దళపతి విజయ్ మక్కల్ ఇయాక్కం’’పేరిట పొలిటికల్ పార్టీని రిజిస్టర్ చేయించినట్లు చంద్రశేఖర్ గురువారం వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో విజయ్ రాజకీయ రంగ ప్రవేశం ఖరారైందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ విషయంపై స్పందించిన విజయ్.. తాను ఎలాంటి రాజకీయ పార్టీ పెట్టలేదని ప్రకటన విడుదల చేశారు.(చదవండి: నాన్న పార్టీ.. నాకు సంబంధం లేదు)
అదే విధంగా తండ్రి నిర్ణయంతో తనకు సంబంధం లేదని, ఆయన రిజిస్టర్ చేయించి పార్టీ కార్యకలాపాల కోసం తన పేరు, ఫొటో వాడితే చర్యలు తీసుకుంటానని కూడా స్పష్టం చేశారు. మరోవైపు.. ఈ పార్టీ స్థాపన అనేది తన వ్యక్తిగత నిర్ణయమని చంద్రశేఖర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో తండ్రీకొడుకుల మధ్య విభేదాలు తలెత్తాయంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ విషయంపై తాజాగా స్పందించిన ఎస్‌ఏ చంద్రశేఖర్, తమ మధ్య ఎలాంటి పొరపొచ్చాలు లేవని, అంతాబాగానే ఉందంటూ వివరణ ఇచ్చారు. ఇక ఈ అంశంపై విజయ్ స్పందిస్తారా లేదా అన్న అంశంపై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment