తమిళ చిత్రసీమలో ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి. తమిళంలోనే కాకుండా తెలుగు, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇటీవల విడుదలైన మహారాజా సినిమా మంచి విజయం సాధించింది. తమిళంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు మహారాజా సినిమాతో సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంలో విజయ్ సేతుపతి సినీరంగంలో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఆర్టిస్టులకు, వారి కుటుంబాలకు తనవంతు సాయం చేస్తున్నాడు. ఈ క్రమంలో, హాస్యనటుడు తెనాలి కుటుంబానికి అండగా విజయ్ సేతుపతి నిలిచాడు.
చాలా చిత్రాలలో హాస్య పాత్రల్లో నటించిన ఆయన విజయ్ సేతుపతి చిత్రాల్లో కూడా నటించారు. ఆయన కుమారుడు విన్నరసన్ డాక్టర్ ఎంజీఆర్ యూనివర్సిటీలో ఫిజియోథెరపీ చదివేందుకు ట్యూషన్ ఫీజు చెల్లించలేకపోతున్నాడని తెలుసుకున్న నటుడు భావ లక్ష్మణన్.. ఆ విషయాన్ని విజయ్ సేతుపతికి చేరవేశాడు. దీంతో విజయ్ సేతుపతి వెంటనే కాలేజీ ఫీజు రూ.76 వేల రూపాయలు చెల్లించాడు. అంతేకాకుండా ప్రతి ఏడాది ఫీజు చెల్లిస్తానని కూడా చెప్పడంతో వారు సంతోషించారు.
ఈ సందర్భంగా నటుడు తెనాలి మాట్లాడుతూ.. నా కుటంబానికి సాయం చేసిన విజయ్ సేతుపతిని భవిష్యత్తులో ఎప్పటికీ మరిచిపోలేమని తెలిపారు. ఈ వార్త విజయ్ సేతుపతి అభిమానులను సంతోషపెట్టింది. ఆర్థికంగా చితికిపోయిన చాలామంది చిన్న ఆర్టిస్టులకు అండగా నిలిచేందుకు విజయ్ సేతుపతి ముందుకు వచ్చారు. ఈ చర్యకు సినీ పరిశ్రమలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment