నెగెటివ్ రోల్స్ చేసే నటీనటులను కొందరు నిజంగానే ద్వేషిస్తారు. వాళ్లు పోషించేవి రీల్ పాత్రలు మాత్రమే అని అర్థం చేసుకోలేక నిజ జీవితంలోనూ ఇంతే కాబోలు అన్నట్లుగా వాళ్లను చూస్తేనే భయపడిపోతారు. తన విషయంలోనూ ఇదే జరిగిందంటున్నాడు బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ.
నన్ను చూస్తేనే భయం
తాజాగా ఓ ఈవెంట్‌కు వెళ్లిన విజయ్ వర్మ ఈ విషయం గురించి మాట్లాడుతూ.. అందమైన అమ్మాయిలు.. వారి తల్లులు ఎందరో నన్ను చూస్తేనే భయపడిపోతారు. ఈ విషయంలో నేను చాలా బాధగా ఫీల్ అవుతాను. పింక్ సినిమాలో క్రూరమైన వ్యక్తిగా నటించాను. అది చిన్న పాత్రే.. అయినా సరే చాలా సీరియస్‌గా తీసుకున్నారు. మహిళల కోసం స్పెషల్ స్క్రీనింగ్ వేసినప్పుడు అందరూ సినిమా చూసి చలించిపోయారు. కొందరైతే ఏడ్చేశారు.
నేనేం చేశా?
ఈ క్రమంలో సింగర్ సునిధి చౌహాన్ దగ్గరకు వెళ్లి ఆమెను ఓదార్చేందుకు ప్రయత్నించాను. కానీ ఆమె.. నా దగ్గరకు రావొద్దు.. నిన్ను చూస్తేనే భయంగా ఉంది అనేసింది. నేను నోరెళ్లబెట్టాను.. దేవుడా, నేనేం చేశాను అనుకున్నాను. ఇంతలో డైరెక్టర్ నన్ను పిలిచి.. నీ పని సక్రమంగా నిర్వర్తించావు అని మెచ్చుకున్నాడు అని గుర్తు చేశాడు.
సినిమా..
విజయ్ వర్మ.. గల్లీ బాయ్ (2019) సినిమాతో పేరు సంపాదించుకున్నాడు. డార్లింగ్స్, షి, మీర్జాపూర్, దాహడ్ వంటి ప్రాజెక్టులతో అలరించాడు. ఐసీ 814: ద కాందహర్ హైజాక్ అనే వెబ్ సిరీస్‌లో చివరగా నటించాడు.
Comments
Please login to add a commentAdd a comment