తమిళసినిమా: ఇటీవల తెలుగు, తమిళ భాషల్లో రీ రిలీజ్‌ల కాలం నడుస్తోందనే చెప్పాలి. కొత్త చిత్రాలు ఆశించిన ప్రేక్షకాదరణ పొందకపోవడంతో రీ రిలీజ్ చిత్రాలే థియేటర్లను కాపాడుతున్నాయి. ఆ జాబితా లో అపరిచితుడు చిత్రం చేరుతోంది. నటుడు విక్రమ్, సదా జంటగా నటించిన తమిళ చిత్రం అన్నియన్ చిత్రానికి తెలుగు అనువాదం అపరిచితుడు. గ్రేట్ డైరెక్టర్ శంకర్ సృష్టి ఈ చిత్రం. నటుడు విక్రమ్‌ను మూడు ఢిఫరెంట్ షేడ్స్‌లో అద్భుతంగా ఈ చిత్రంలో శంకర్ చూపించారు. హాలీవుడ్ చిత్రాలకు దీటుగా తెరకెక్కించిన అపరిచితుడు చిత్రం 2005లో విడుదలై సంచలన విజయాన్ని సాధించింది.
తెలుగులో ఓ అనువాద చిత్రంలా కాకుండా ఒక భారీ నేరు చిత్రంలా విడుదలై బయ్యర్లకు వసూళ్ల వర్షం కురిపించింది. కథ, కథనాలు, దర్శకుడి స్టైలిష్ దర్శకత్వం, నటుడు విక్రమ్ నటనా ప్రతిభ ప్రేక్షకలను విపరీతంగా ఆకట్టుకుంది. అప్పట్లోనే అత్యంత భారీ బడ్జెట్‌లో రూపొందిన అపరిచితుడు చిత్ర క్‌లైమ్యాక్స్ సన్నివేశాల కోసమే 120 కెమెరాలతో 270 డిగ్రీల రొటేషన్ ఫొటోగ్రఫీ టెక్నిక్‌తో చిత్రీకరించారు దర్శకుడు శంకర్. ఇదే టెక్నాలజీతో రూపొందిన హాలీవుడ్ చిత్రం మ్యాట్రిక్స్ కంటే అపరిచితుడు చిత్రాన్ని శంకర్ బ్రహ్మండంగా తెరకెక్కించారు. దాదాపు 200 మంది స్టంట్ కళాకారులతో చిత్రీకరించిన ఫైట్ దృశ్యాలను చూస్తుంటే ఇప్పటికీ ఒళ్లు గగుర్పొడుస్తోంది.
నెదర్లాండ్‌లోని పుష్పాల ఎగ్జిబిషన్‌లో చిత్రీకరించిన ఇందులోని పాట మరో హైలెట్. మల్టీపుల్ పర్సనాలిటీ డిజాస్టర్ కారణంగా మామూలు మనిషి సూపర్‌హీరోగా మారి సమాజంలో జరుగుతున్న అరాచకాలను, కాలరాస్తూ, తప్పు చేసిన వాళ్లు ఎంతటి వారైనా నరకాన్ని అనుభవించేలా శిక్షలు వేసే పాత్రలో నటుడు విక్రమ్ నటన గురించి ఎంత చెప్పినా చాలదు. అదేవిధంగా ఫ్రెంచ్ భాషలోకి అనువాదం అయిన తొలి ఇండియన్ చిత్రం అపరిచితుడు. కాగా అలాంటి అపరిచితుడు చిత్రం ఇప్పుడు మళ్లీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సుమారు 700 థియేటర్లలో విడుదలకు సిద్ధం అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment