పొన్నియిన్ సెల్వన్ వంటి సూపర్ హిట్ సిరీస్‌ల తరువాత విక్రమ్ నటించిన చిత్రం తంగలాన్ కోసం సౌత్ ఇండియా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇందులో పార్వతి, మాళవిక మోహన్, పశుపతి ముఖ్యపాత్రలు పోషించారు. పా.రంజిత్ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
టీజర్‌లో ఎలాంటి డైలాగ్స్ లేకున్నా విజువల్స్‌తో పాటు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో దుమ్ములేపాడు. ఇందులో విక్రమ్‌ను చాలా భయంకరంగా చూపించారని తెలుస్తోంది. యుద్ధంలో కత్తి పట్టుకొని యోధుడిలా చేతికి దొరికిన వారందరినీ హతమారుస్తు కనిపించాడు. ఓ సీన్‌లో కోబ్రా లాంటి పాముని చేతపట్టుకుని రెండు ముక్కలుగా చేసి కింద పడేస్తాడు. ఇలా ఒళ్లు గగుర్పొడిచే సీన్స్ ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది.
కర్ణాటక రాష్ట్రంలోని బంగారు గనుల నేపథ్యంలో రూపొందిస్తున్నట్లు దర్శకుడు పా.రంజిత్ ఇది వరకే తెలిపారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఒక డిఫరెంట్ కథనంతో తంగలాన్ తెరకెక్కినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment