విశాల్​ ఆరోపణలపై కేంద్రం రియాక్షన్‌.. వాళ్లకు మద్ధతుగా బాలీవుడ్‌ | I&B Ministry Responds To Vishal's Allegations Against CBFC | Sakshi
Sakshi News home page

Vishal: విశాల్​ ఆరోపణలపై కేంద్రం రియాక్షన్‌.. వాళ్లకు మద్ధతుగా బాలీవుడ్‌

Published Sat, Sep 30 2023 8:34 AM | Last Updated on Sat, Sep 30 2023 9:00 AM

Vishal CBFC Allegations Respond Central Ministry Of Information - Sakshi

సౌత్‌ ఇండియా స్టార్ హీరో విశాల్ CBFC (Central Board of Film Certification)పై సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. తన మూవీ మార్క్ ఆంటోనీ హిందీ వర్షన్ రిలీజ్‌ కోసం సెన్సార్‌ బోర్డ్‌ లంచం తీసుకున్నారంటూ ఆధారాలతో సహా ఆయన వీడియో రిలీజ్ చేశారు. ఈ అవినీతిని జీర్ణించుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే, పీఎం నరేంద్ర మోదీ దృష్టికి వెళ్లాలని వీడియోలో పేర్కొన్నారు. విశాల్‌ ఆరోపణలపై కేంద్ర సమాచార, ప్రసార శాఖ తాజాగా స్పందించి.. ఈ విషయం చాలా దురదృష్టకరమని ఇలా పేర్కొంది.

(ఇదీ చదవండి: నటి హరితేజ విడాకులు.. వైరల్‌గా మారిన పోస్ట్‌)

'CBFCలో జరిగిన అవినీతిపై విశాల్ బయటపెట్టిన అంశం చాలా దురదృష్టకరమని మేము భావిస్తున్నాం. ఈ విషయంపై విచారణ జరిపేందుకు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నుంచి ఒక సీనియర్ అధికారిని వెంటనే ముంబయికి పంపాం. తప్పు జరిగినట్లు తేలితే శిక్ష తప్పదు. ప్రతి ఒక్కరూ మంత్రిత్వ శాఖకు సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. CBFC వేధింపులకు సంబంధించిన ఏదైనా విషయాలను గురించి సమాచారాన్ని తెలిపేందుకు jsfilms.inb@nic.inను ఉపయోగించుకోవల్సిందిగా కోరుతున్నాము'. అని సమాచార మంత్రిత్వ శాఖ తన ఎక్స్‌ (ట్విట్టర్)​ ద్వారా తెలిపింది.

(ఇదీ చదవండి: అదిరిపోయే కాంబినేషన్లో 'హిట్లర్‌'గా వస్తున్న విజయ్‌ ఆంటోనీ)

అయితే సమాచారా, ప్రసారాల మంత్రిత్వ శాఖ పోస్టుపై పలు బాలీవుడ్ నిర్మాణ సంస్థలు స్పందించాయి. తమకు ఎప్పుడూ ఇలాంటి అనుభవాలు ఎదురుకాలేదని పేర్కొన్నాయి. బాలీవుడ్ నటుడు, నిర్మాత ఫర్హాన్ అక్తర్‌కు చెందిన నిర్మాణ సంస్థ ఎక్సెల్ ఎంటర్‌టైన్మెంట్ స్పందిస్తూ.. ‘సీబీఎఫ్‌సీ, సమాచార-ప్రసారాల మంత్రిత్వ శాఖ రెండింటితోనూ తమకు మంచి  సంబంధాలు ఉన్నాయి. 2001 నుంచి ఎంతో దగ్గరగా చూస్తున్నాం.. సెన్సార్‌ బోర్డు వారు ఎంతో పారదర్శకతగా పనిచేస్తున్నారు. తమ తొలి చిత్రం దిల్ చహ్‌తా హై దగ్గర నుంచి ఇటీవల విడుదలైన ఫక్రే 3 సినిమా వరకు తమకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని పేర్కొన్నారు. 

మరోవైపు ఇదే విషయంపై బాలీవుడ్‌ దర్శకుడు అశోక్ పండిట్​ కూడా స్పందించారు. విశాల్​ పేర్కొన్న ఎం రాజన్, జిజా రాందాస్ ఆ ఇద్దరూ CBFC ఉద్యోగులు కారని ఆయన చెప్పుకొచ్చారు. అంతే కాకుండా విశాల్​ చేస్తున్న ఆరోపణల తీవ్రత ఎక్కువగా ఉన్నందున.. ఈ విషయంపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్​ చేశారు. అయితే, ఈ స్పందనపై నెటిజన్ల నుంచి విమర్శలు వస్తున్నాయి. సౌత్‌ పరిశ్రమ నుంచి బాలీవుడ్‌పై ఎలాంటి కామెంట్‌ చేసినా తట్టుకోలేరని పలు కామెంట్లు చేస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement