ఫీమేల్‌ క్యారెక్టర్‌ చేయాలని ఉంది | Vishwak Sen Talks About Ashoka Vanam Lo Arjuna Kalyanam | Sakshi
Sakshi News home page

ఫీమేల్‌ క్యారెక్టర్‌ చేయాలని ఉంది

Published Thu, May 5 2022 5:23 AM | Last Updated on Thu, May 5 2022 5:23 AM

Vishwak Sen Talks About Ashoka Vanam Lo Arjuna Kalyanam - Sakshi

‘‘సెట్స్‌లో నాదైన శైలిలో నటించాలనుకుంటాను. అందుకే దర్శకుల నుంచి పెద్దగా రిఫరెన్సెస్‌ కూడా అడగను. దర్శకులు చెప్పిన కథ, అందులోని సందర్భాల ప్రకారం నటించడమే నాకు ఇష్టం’’ అని దర్శక–నటుడు విశ్వక్‌ సేన్‌ అన్నారు. విద్యాసాగర్‌ చింతా దర్శకత్వంలో విశ్వక్‌ సేన్, రుక్సార్‌ థిల్లాన్‌ జంటగా బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ సమర్పణలో బాపినీడు, సుధీర్‌ ఈదర నిర్మించిన చిత్రం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’. ఈ చిత్రం రేపు థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా హీరో విశ్వక్‌సేన్‌ చెప్పిన విశేషాలు.

‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ నా కెరీర్‌లో ది బెస్ట్‌ ఫిల్మ్‌ అవుతుందని నేను మొదట్నుంచి చెబుతూనే ఉన్నాను. ఇప్పుడూ అదే చెబుతున్నాను. ఈ సినిమాకు మ్యాజిక్‌ జరిగింది. కచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నాం. నిజానికి ఈ కథ విన్న వెంటనే సినిమా చేసేయాలనుకున్నాను. కథ వినడమే ఈ టైటిల్‌తోనే విన్నాను. సో.. వేరే టైటిల్స్‌ అనుకోలేదు. సినిమాలో తెలుగు రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలు అనేవి ఒక లేయర్‌ మాత్రమే. ఇందులో చాలా అంశాలు ఉన్నాయి. సందేశం కూడా ఉంది. ముఖ్యంగా అనవసరంగా పోలికలు పెట్టుకుని ఆత్మన్యూనతా  భావంతో బాధపడే అందరికీ ఈ సినిమా కనెక్ట్‌ అవుతుంది. ‘మీ(మహిళలను ఉద్దేశిస్తూ...) గురించి మీరే నిలబడాలి’ అనే డైలాగ్స్‌ కూడా ఉన్నాయి.

ఆ లోపే పెళ్లి చేసుకుంటాను!
ఈ సినిమాలో అల్లం అర్జున్‌కుమార్‌ పాత్రలో కనిపిస్తాను. నా తొలి సినిమా ‘వెళ్లిపోమాకే’కు చేసిన వర్క్‌షాప్స్‌ కూడా ఈ సినిమాకు ఉపయోగపడ్డాయి. 30 ఏళ్ల వయసు మీద పడిన పెళ్లి కాని అల్లం అర్జున్‌ కుమార్‌ క్యారెక్టర్‌ ప్రేక్షకులను మెప్పిస్తుంది. ‘మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావ్‌’ లాంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లు వచ్చి చాలా రోజులైంది. ఇప్పుడు అలాంటి ఎంటర్‌టైన్‌మెంట్‌ను మా సినిమా అందిస్తుందనే నమ్మకం ఉంది. ఈ సినిమా కోసం బరువు పెరిగాను. నిజానికి బరువు తగ్గడం సులభమే కానీ పెరగడం కష్టం. ఇక పెళ్లిపై నాకు మంచి అభిప్రాయం ఉంది. నాకు 30 ఏళ్లు దాటే లోపే పెళ్లి చేసుకుంటాను. ఇక యాక్టర్‌గా నాకు విభిన్నమైన పాత్రలు చేయాలని ఉంది. కమల్‌హాసన్‌గారు ‘భామనే సత్యభామనే’ సినిమాలో చేసిన ఫీమేల్‌ క్యారెక్టర్‌ లాంటివి చేయడానికి సిద్ధమే. అలాగే నేను తెలంగాణ హీరోగా మాత్రమే ఉండాలనుకోవడం లేదు. ఇతర భాషల్లోనూ సినిమాలు చేస్తాను.

పాన్‌ ఇండియా స్థాయిలో...
తమిళ సినిమా ‘ఓ మై కడవులే..’ చిత్రానికి తెలుగు రీమేక్‌ ‘ఓరి... దేవుడా’ సినిమా చేశాను. ‘దమ్కీ’ సినిమా చేస్తున్నా. అయితే ‘దమ్కీ’ సినిమా కథపై దర్శకుడు నరేష్‌ కన్నా నాకే ఎక్కువ కమాండ్‌ ఉందనిపించి ఈ సినిమాకు నేను దర్శకత్వం వహించాలని నిర్ణయించుకున్నాను. నరేశ్‌తో భవిష్యత్‌లో మరో సినిమా ఉండొచ్చు. హిందీలో ఓ సినిమా చేసే ప్రయత్నాలను మొదలుపె ట్టాను. ‘సవారి’ ఫేమ్‌ సాహితి దర్శకత్వంలో ‘స్టూడెంట్‌’ అనే సినిమా చేయాల్సి ఉంది. ‘ఫలక్‌నుమా దాస్‌’ సినిమాకు సీక్వెల్‌ ఉంటుంది. ఈ సినిమాను పాన్‌ ఇండియా స్థాయిలో ప్లాన్‌ చేస్తున్నాం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement