టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘వాల్తేరు వీరయ్య’. 2023 సంక్రాంతి కానుకగా జనవరి 13 ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రం. గతేడాది బాక్సాఫీస్ హిట్‌గా భారీ విజయాన్ని అందుకుంది. శుత్రిహాసన్, రవితేజ నటించిన ఈ చిత్రం టాలీవుడ్‌లో గతేడాది అత్యధిక కలెక్షన్స్ (రూ. 236 కోట్లు) రాబట్టిన చిత్రంగా రికార్డుకెక్కింది.
ఒకప్పుడు సినిమాలు 100 రోజుల పాటు థియేటర్‌లలో కనిపిస్తేనే అదొక రికార్డు.. ఇప్పటి రోజుల్లో ఏ సినిమా అయినా కానివ్వండి బాక్సాఫీస్ వద్ద మినిమమ్ రూ. 100 కోట్లు వచ్చాయా..? అని చూస్తున్నారు. అలా అయితేనే నేటి రోజుల్లో సినిమా హిట్ అనేస్తున్నారు. అలాంటిది చిరంజీవి వాల్తేరు వీరయ్య 365 రోజుల వేడుకకు రెడీగా ఉంది. ఏపీలోని అవనిగడ్డలో ఉన్న రామకృష్ణ థియేటర్‌లో రోజుకు నాలుగు ఆటలతో విడుదల రోజు నుంచి ఇప్పటి వరకు విజయవంతంగా సినిమా కొనసాగుతుంది. మరో రెండు రోజుల్లో 365 రోజులు పూర్తి చేసుకుని తెలుగు ఇండస్ట్రీలో వాల్తేరు వీరయ్య సరికొత్త రికార్డ్‌ను క్రియేట్ చేయనుంది.
నేడు సాయింత్రం (జనవరి 9) అవనిగడ్డలోని రామకృష్ణ థియేటర్‌లో మెగా ఫ్యాన్స్ 365 రోజుల వేడుక చేయనున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. గతేడాదిలో వాల్తేరు వీరయ్య 200 రోజుల వేడుకను చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో జరిపింది. ఆ సమయంలో చిరంజీవి ఇలా మాట్లాడారు. 'అత్యధిక రోజులు సినిమా ప్రదర్శితమై, విజయానికి గుర్తుగా షీల్డు అందుకున్నందుకు ఒళ్లు పులకరిస్తోంది. చరిత్రను మళ్లీ తిరగరాసినట్టు అనిపిస్తోంది' అని సంతోషం వ్యక్తం చేశారు. అలా పాతరోజులను ఆయన మళ్లీ గుర్తుచేసుకున్నారు. వాల్తేరు వీరయ్య నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment