‘‘చిరంజీవి, బాలకృష్ణగార్లలో ఉన్న కామన్ క్వాలిటీ ఏంటి అంటే వారి అంకితభావం, సమయపాలన. ఏ డ్యాన్స్ మూమెంట్‌ని అయినా సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసేంతవరకూ రిలాక్స్ అవ్వరు’’ అన్నారు నృత్యదర్శకుడు వీజే శేఖర్. చిరంజీవీ టైటిల్ రోల్‌లో, రవితేజ ప్రధాన పాత్రలో బాబీ దర్శకత్వంలో రూపొందిన ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ‘వీరసింహారెడ్డి’ చిత్రాలు సంక్రాంతి సందర్భంగా వరుసగా జనవరి 13, జనవరి 12న రిలీజ్ కానున్నాయి.
ఈ రెండు చిత్రాలను నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించారు. ‘వాల్తేరు వీరయ్య’లోని అన్ని పాటలకు, ‘వీరసింహారెడ్డి’లోని రెండు పాటలకు (సుగుణసుందరి, మా భావ మనోభావాల్) కొరియోగ్రఫీ చేశారు శేఖర్. ఈ సందర్భంగా సోమవారం విలేకర్ల సమావేశంలో శేఖర్ మాట్లాడుతూ– ‘‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ ఒకేసారి సంక్రాంతి సమయంలోనే రిలీజ్ అవుతాయనుకోలేదు. కాబట్టి ఈ సినిమాల్లోని పాటలకు నృత్యరీతులు సమకూర్చేప్పుడు పెద్దగా ఆందోళనపడలేదు. కానీ ఇప్పుడు రెండు చిత్రాలూ సంక్రాంతికే వస్తుండటంతో ఒకవైపు ఆందోళనగా మరోవైపు సంతోషంగా ఉంది.
ఈ సంక్రాంతి నాకు పెద్ద పండగ అని చెప్పగలను. ఇక సోషల్ మీడియాలో కొన్ని మూమెంట్స్ రీల్స్ రూపంలో వైరల్ అవుతుంటాయి. ఈ మూమెంట్స్ బాగుంటే వీటి తాలూకు పాటలను, కంటెంట్‌ను బట్టి సినిమాను ఆడియన్స్ హిట్ చేస్తున్నారు. సో.. సిగ్నేచర్ స్టెప్స్ ఉంటే సినిమాకు ప్లస్ అయ్యేలా అనిపిస్తోంది. నా కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా నేను సిగ్నేచర్ స్టెప్స్‌ను ఫాలో అవుతూ వస్తున్నాను. అలాగే సీనియర్లకు కొన్నిసార్లు మూమెంట్స్‌ని బట్టి రెండు, మూడు ఆప్షన్లు రెడీ చేసుకుంటుంటాం. ఇక దర్శకత్వ ఆలోచన ఉంది కానీ ఎప్పుడో కచ్చితంగా చెప్పలేను. ప్రస్తుతం మహేశ్‌బాబు–త్రివిక్రమ్‌గార్ల కాంబినేషన్ సినిమా, రవితేజగారి ‘రావణాసుర’, ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలు చేస్తున్నాను’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment