బాలీవుడ్‌లో హీరోహీరోయిన్ల మధ్య సాగే లవ్ ఎఫైర్స్ అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు అమితాబ్ బచ్చన్-రేఖ. బాలీవుడ్‌ని ఓ ఊపు ఊపింది వీరి ప్రేమ కథ. ‘దో అన్‌జానే’ (1976) ఈ ఇద్దరికీ తొలి సినిమా. అప్పుడే ఒకరితో ఒకరికి పరిచయం కూడా. కానీ అప్పటికే రేఖ అమితాబ్ కంటే సీనియర్. అంతకు ముందు వరకు రేఖకు, అమితాబ్ బచ్చన్ అంటే దీదీబాయి (జయా బచ్చన్) భర్తగానే తెలుసు.
‘దో అన్‌జానే’సెట్స్ మీదే అమితాబ్ బచ్చన్‌గా పరిచయం అయ్యాడు. పరిచయం కాస్త ప్రేమగా మారింది. సినిమాలో వీరిద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది. ఇది ప్రేక్షకులకు తెగ నచ్చింది. దాంతో ఇద్దరి కాంబినేషన్‌లో సినిమాల సంఖ్య పెరిగింది. ఇక వీరిద్దరి ప్రేమ వ్యవహారం ఎప్పుడు బయటపడింది అంటే 1978లో ‘గంగా కీ సౌగంద్’ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇందులోనూ రేఖ, అమితాబ్‌లే హీరోహీరోయిన్లు. ఒక సహనటుడు రేఖ పట్ల అనుచితంగా ప్రవర్తించసాగాడు. రేఖ వారించింది. అయినా వినిపించుకోలేదు అతను. పైగా రేఖ నిస్సహాయతను అలుసుగా తీసుకోసాగాడు.
ఇదంతా గమనిస్తున్న అమితాబ్ ఇక ఊరికే ఉండలేకపోయాడు. ఆవేశంగా ఆ నటుడి దగ్గరకు వెళ్లి చెడమడా తిట్టేశాడు. అమితాబ్ రియాక్షన్‌కి అక్కడున్న వారందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. మేడం పట్ల సార్‌కు ఈ స్పెషల్ కేర్ ఏంటి అని గుసగుసలాడుకోవడం ప్రారంభించారు. ఈ వార్తలు కాస్త జయా బచ్చన్ చెవిన పడ్డాయి. ‘సిల్‌సిలా’ సినిమా విడుదల వరకు ఇదే కొనసాగింది. ఆ తర్వాత రేఖ-అమితాబ్‌ల మధ్య ఉన్న బంధం బలహీనపడుతూ వచ్చింది.
గతంలో పీపుల్ మ్యాగ్‌జైన్‌కిచ్చిన ఇంటర్వ్యూలో జయా బచ్చన్.. అమితాబ్-రేఖల లవ్ ఎఫైర్‌పై స్పందించారు. ఇన్ని పుకార్ల మధ్య ఎలా తన వివాహ బంధాన్ని నిలబెట్టుకున్నారో వెల్లడించారు. ఈ సందర్భంగా జయా బచ్చన్ మాట్లాడుతూ.. ‘‘వీటి గురించి తెలిసినప్పుడు నేను బిగ్ బీని ఎలాంటి ప్రశ్నలు వేసేదాన్ని కాదు. ఆయనను ఒంటరిగా వదిలేసేదాన్ని. ఆలోచించుకునే అవకాశం ఇచ్చేదాన్ని. ఇక మా వివాహబంధంపై నాకు పూర్తి నమ్మకం ఉంది. నేను ఎంతో మంచి వ్యక్తిని వివాహం చేసుకున్నాను. బంధాలకు విలువిచ్చే ఇంటికి కోడలిగా వెళ్లాను’’ అన్నారు.
‘‘ఇక సినిమా ఇండస్ట్రీలాంటి రంగుల ప్రపంచంలో అన్ని సవ్యంగా సాగవు. నాకే సొంతం.. అంటూ కట్టుబాట్లు విధించడం కూడా క్షేమం కాదు. ఇక్కడ మీరు ఆర్టిస్టిలను పిచ్చివాళ్లు చేయవచ్చు.. లేదా వారి ఎదుగుదలకు సాయం చేయవచ్చు. ఎవరిని బలవంతంగా కట్టి పడేయలేం’’ అన్నారు.
బిగ్ బీ ఎఫైర్స్‌కు సంబంధించిన వార్తలు విన్నప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటనే ప్రశ్నకు జయా బచ్చన్ బదులిస్తూ.. ‘‘నేను మనిషినే.. తప్పక స్పందించాలి. చెడు వార్తలు, మంచి వార్తలు అన్నింటిపై స్పందించాలి. మన మాట, స్పందన, చూపు ద్వారా తనకు నమ్మకం కలిగించాలి. ఇక బిగ్ బీతో నటించిన ప్రతి హీరోయిన్‌తో ఆయనకు సంబంధం ఉన్నట్లు మీడియా రాసుకొచ్చేది. వాటన్నింటిని మనసులోకి తీసుకుంటే నా జీవితం నరకం అయ్యేది. ఏళ్లు గడుస్తున్న కొద్ది మా బంధం మరింత బలపడింది’’ అంటూ చెప్పుకొచ్చారు జయా బచ్చన్.
Comments
Please login to add a commentAdd a comment