అందరూ ఊహించనట్టే ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ వచ్చింది. ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో తొలిసారి ఇండియన్ మూవీకి ఆస్కార్ రావడం..అదీ అచ్చ తెలుగు పాట కావడం నిజంగా మనందరికి ఎంతో గర్వకారణం. సినిమాలో నాలుగున్నర నిమిషాల నిడివి మాత్రమే ఉన్న ఈ పాట కోసం చంద్రబోస్ కొన్ని నెలల పాటు కష్టపడి సాహిత్యం అందించగా.. కీరవాణి అదిరిపోయే సంగీతం అందించారు. రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ అద్భుతంగా ఆలపించారు.
అయితే ఈ పాట ఆస్కార్ స్థాయికి వెళ్లడం వెనక ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ కూడా కీలక పాత్ర వహించింది. రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లు అదిరిపోయే స్టెప్పులు వేయడం వల్లే ఈ పాట మరింత ఫేమస్ అయింది. ఇద్దరి స్టార్ హీరోలతో అలాంటి స్టెప్పులు వేయించిన ప్రేమ్ రక్షిత్ గురించి ఇప్పుడు అందరు చర్చించుకుంటున్నారు. ఇప్పుడు ఆయన ఓ గొప్ప కొరియోగ్రాఫర్. కానీ ఒకప్పుడు మాత్రం టైలర్ షాపులో పనివాడు. ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి చేరాడు.
ప్రేమ్ రక్షిత్ తండ్రి ఒక వజ్రాల వ్యాపారి. 1993లో కుటుంబ విబేధాల కారణంగా ఆయన ఆస్తులు పోయాయి. వ్యాపారం మానేసి సినిమాల్లో డాన్స్ అసిస్టెంట్ గా మారారు. ఆ సమయంలో ప్రేమ్ రక్షిత్‌ని టైలర్ షాప్‌లో పని చేశాడట. డ్యాన్స్‌పై ఇంట్రస్ట్ ఉండడంతో సినిమా ప్రయత్నాలు చేశాడు. టైలర్ షాపులో పని చేస్తూనే.. కొరియోగ‍్రఫీగా ట్రై చేశాడు. కానీ ఎలాంటి అవకాశాలు రాలేదు. మరోవైపు అప్పులు పెరిగిపోయాయి. దీంతో కుటుంబాన్ని పోషించడం తన వల్ల కాదని భావించి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడట.
తాను చనిపోతే డ్యాన్స్ ఫెడరేషన్ వాళ్ళు తన కుటుంబానికి 50 వేల రూపాయలు ఆర్ధిక సహాయం చేస్తారనీ.. దానితో కుటుంబానికి కొన్ని ఇబ్బందులైనా తగ్గుతాయని అతని ఆలోచన. ఒకరోజు పక్కింటి వారి నుంచి సైకిల్ అరువు తెచ్చుకొని మెరీనా బీచ్‌కు వెళ్లాడు. అక్కడే సూసైడ్ చేసుకోవాలనుకున్నాడు. తాను చనిపోతే సైకిల్ ఓనర్ తన కుటుంబాన్ని ఇబ్బంది పెడతాడని భావించి.. అది ఇచ్చేసి వచ్చి చనిపోవాలనుకున్నాడట. అలా ఇంటికి వెళ్లగానే.. సినిమాల్లో డ్యాన్స్ మాస్టర్‌గా పనిచేసే అవకాశం వచ్చిందని తండ్రి చెప్పాడట. దాంతో తన కష్టాలు తీరిపోయాయని.. ప్రేమ్ ఆత్మహత్యా ప్రయత్నం విరమించుకున్నాడట. ఆ ఒక్క క్షణం నా జీవితాన్నే మార్చేసిందని ఓ ఇంటర్వ్యూలో ప్రేమ్ రక్షిత్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment