తన అందం, అభినయంతో చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ యామీ గౌతమ్ ఈ ఏడాది జూన్‌లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ‘ఉరి’ సినిమాతో ‘ఉత్తమ దర్శకుడి’గా జాతీయ అవార్డు అందుకున్న ఆదిత్య ధార్‌తో కలిసి ఆమె ఏడడుగులు నడిచింది. వీరిద్ద మధ్య ఉన్న లవ్ అఫైర్ గురించి మీడియాలో కథనాలు వచ్చిన స్పందిచకుండా, సడెన్‌గా పెళ్లి చేసుకొని అందరికి షాకిచ్చారు. అప్పట్లో ఈ జంట పెళ్లి హిందీ సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే ఈ జంట మాత్రం తమ ప్రేమ, పెళ్లి గురించి మాత్రం ఎక్కడా పెదవి విప్పలేదు. తాజాగా యామీ గౌతమ్ తన లవ్ స్టోరీని మీడియాతో పంచుకుంది. ‘ఉరి’సినిమా ప్రమోషన్స్ సమయంలోనే తాము ప్రేమలో పడిపోయినట్లు చెప్పింది.
ఆదిత్య, నేను కలిసి ‘ఉరి’సినిమా చేశాం. ఆ సమయంలోనే ఇద్దరికి పరిచయం ఏర్పడింది. సినిమా ప్రమోషన్ సమయంలో మా స్నేహం మరింత బలపడింది. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఆదిత్యతో పరిచయం ఏర్పడకముందే అతనంటే నాకు గౌరవం ఉండేది. ఇతరుల పట్ల ఆయన మర్యాదగా వ్యవహరిస్తాడు. దర్శకుడిగా ఒత్తిడిలో ఉన్నాకూడా.. ఎదుటివారితో గౌరవంగా మాట్లాడుతాడు. ఆదిత్య చాలా మంచి వాడని అందరు చెబుతుంటే విన్నా.. అతనితో పరిచయం ఏర్పడ్డాక అది నిజమేనని భావించా. పని చేసే చోట అతని మంచి వాతావరణాన్ని సృష్టిస్తాడు. మా మధ్య పరస్పర గౌరవం ఉంది. ప్రేమపై ఒక్కొక్కరి ఒక్కో అభిప్రాయం ఉంటుంది. నా దృష్టిలో మంచి గుణం, అర్థం చేసుకునే హృదయం ఉండమే అసలైన ప్రేమ’అని యామీ గౌతమ్ తన లవ్‌స్టోరీ చెప్పుకొచ్చింది.
అలాగే తమ ప్రేమ గురించి ఇండస్ట్రీలోని కొంతమంది స్నేహితులకు ముందే తెలుసని, కానీ వారు ఎక్కడా తమ గురించి చెప్పకుండా, ప్రైవసీ ఇచ్చారని చెప్పింది. ఇక గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసుకోవడంపై స్పందిస్తూ.. ‘హంగులు, ఆర్భాటాలలో పెళ్లి చేసుకోవడం ఇద్దరికి ఇష్టం లేదు. కోవిడ్ కారణంగా కుటుంబ సభ్యులు, కొంతమంది స్నేహితుల సమక్షంలోనే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. చాలా మంది స్నేహితులకు, సన్నిహితులకు పెళ్లి సమాచారం ఇవ్వలేకపోయాం. కానీ వారు పరిస్థితిని అర్థం చేసుకొని మాకు తోడుగా నిలిచారు’అని యామీ గౌతమ్ చెప్పుకొచ్చింది.
ఇక యామీ గౌతమ్ విషయానికొస్తే.. 'ఫెయిర్ అండ్ లవ్లీ' యాడ్‌తో ప్రేక్షకులకు పరిచయమవగా 'ఉల్లాస ఉత్సాహ' అనే కన్నడ చిత్రంతో సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టింది. 'విక్కీ డోనర్'తో బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న ఈ హీరోయిన్ మొదటి చిత్రానికే ఫిల్మ్‌ఫేర్ అవార్డును సంపాదించుకుంది. తెలుగులో నువ్విలా, గౌరవం, యుద్ధం చిత్రాల్లో కనిపించిన ఆమె చివరిసారిగా నితిన్ సరసన 'కొరియర్ బాయ్ కల్యాణ్'లో నటించింది. వీటితో పాటు తమిళ, పంజాబీ, కన్నడ, మలయాళ చిత్రాల్లోనూ నటించి అక్కడి ప్రేక్షకులను కూడా మెప్పించింది.
దర్శకుడు ఆదిత్య ధార్ విషయానికి వస్తే.. కాబుల్ ఎక్స్‌ప్రెస్ చిత్రంతో డైరెక్టర్ అయ్యారు. ఆ తర్వాత హాల్ ఏ దిల్, వన్ టూ త్రీ, డాడీ కూల్, ఆక్రోష్, తేజ్ చిత్రాలకు లిరిక్ రైటర్‌గా, డైలాగ్ రైటర్‌గా పనిచేశారు. యూరీ: ది సర్జికల్ స్ట్రైక్ చిత్రంతో దర్శకుడిగా మారి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆయన దర్శకత్వం వహించిన ది ఇమ్మోరల్ ఆశ్వత్థామ చిత్రం విడుదల కావాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment