‘‘తెలుగు భాషా దినోత్సవం, గిడుగు వెంకట రామమూర్తిగారి జన్మదినాన్ని పురస్కరించుకుని నేను తీయబోయే కొత్త సినిమా నేపథ్యం ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. 1980 నేపథ్యంలో ఈ కథ జరుగుతుంది. తెలుగు భాష, సంస్కృతి, తెలుగు జాతి నేపథ్యం వంటి అంశాలను ప్రతిబింబించేలా మా సినిమా ఉంటుంది’’ అని డైరెక్టర్ వైవీఎస్ చౌదరి అన్నారు. దివంగత ఎన్టీఆర్ ముని మనవడు, హరికృష్ణ మనవడు, దివంగత జానకీ రామ్ (ఎన్టీఆర్ సోదరుడు) తనయుడు తారక రామారావు హీరోగా, తెలుగమ్మాయి వీణా రావ్‌ని హీరోయిన్‌గా పరిచయం చేస్తూ వైవీఎస్ చౌదరి ఓ సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే.
యలమంచిలి గీత ఈ చిత్రం నిర్మించనున్నారు. కాగా గురువారం హీరో అక్కినేని నాగార్జున బర్త్ డే, తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో రచయిత చంద్రబోస్ మాట్లాడుతూ– ‘‘ప్రపంచంలో అత్యంత మధురమైన భాషల్లో రెండోది తెలుగు. ఈ సినిమాలో మరింత అందమైన, అర్థవంతమైన ΄పాటలు రాసే అవకాశం ఇచ్చిన చౌదరిగారికి, కీరవాణిగారికి ధన్యవాదాలు’’ అన్నారు.
మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా మాట్లాడుతూ–‘‘తెలుగు వాడు తెలుగు భాష గొప్పదనం గురించి తెలుగువాళ్లకి చెప్పడం విచిత్రమైన పరిస్థితి. తెలుగు మాట్లాడితే తల్లితండ్రులు, టీచర్లు కోప్పడే పరిస్థితి తెలుగులోనే ఉంది. ఇప్పుడున్న సమాజం ఇలానే కొనసాగితే తెలుగు ఉనికి కోల్పోయే పరిస్థితి ఉంటుంది’’ అన్నారు. ‘‘వైవీఎస్ చౌదరి, కీరవాణి, చంద్రబోస్, సాయి మాధవ్ గార్లతో ఈ సినిమా కోసం పని చేయనుండటం ఆనందంగా ఉంది’’ అని యలమంచిలి గీత తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment