వేడినీళ్లలో దుస్తులు ఉతుకుతున్న మహిళలు
ఏటూరునాగారం: సాధారణంగా భూమి నుంచి మోటార్ల ద్వారా నీరు బయటకు వస్తే కొంత గోరువెచ్చగా ఉంటుంది. కానీ, ఇక్కడ ఉన్న బోరులో నుంచి ఏడాదిపొడవునా.. వస్తుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. చమురు నిక్షేపాలు ఉన్నాయని 1978లో ములుగు జిల్లా ఏటూరునాగారం రామన్నగూడెంలో తవ్వకాలు జరిపారు. ఈ క్రమంలో వేసిన బోరు నుంచి నిర్విరామంగా వేడినీరు ఉబికి వస్తుంది.
ఎలాంటి మోటారు, యంత్రాలు, మిషన్లు లేకుండానే నీరు ఉబికి రావడం ఒక వింత కాగా.. ఆ నీరు వర్షాకాలం, వేసవి కాలం, చలికాలంలో సైతం వెచ్చగా ఉండడం మరో వింతగా కన్పిస్తుంది. రామన్నగూడెంలోని ప్రజలు ఈ వేడినీళ్ల కాల్వలో దుస్తులు ఉతడకం, స్నానాలు చేయడంతోపాటు గృహఅవసరాలకు సైతం ఈ నీటిని వినియోగిస్తుంటారు. అయితే కొత్తగా ఈ ప్రాంతానికి వచ్చిన వారికి మాత్రం ఈ విషయం ఆశ్చర్యాన్ని కల్గించకమానదు.
విత్తనాలకు ప్రత్యేకత
వరి విత్తనాలు మొలకెత్తేందుకు రైతులు సాధారణంగా గోలెం, డ్రమ్ము లేదా ధాన్యం విత్తనాలపై గోనెసంచులు వేసి నీటితో తడుపుతుంటారు. కానీ రామన్నగూడెంలోని రైతులు వరి విత్తనాల బస్తాలను ఈ వేడినీళ్ల కాల్వలో నానబెట్టి నాటితే వారి నారు ఏపుగా, శక్తివంతంగా పెరుగుతుందని విశ్వసిస్తారు. అందుకోసం విత్తనాలు తెచ్చిన సమయంలో బస్తాలను ఈ నీటిలో వేసి 24 గంటల తర్వాత తీసి మంచంపై ఆరబోసుకుంటారు.
ఇలా చేయడం వల్ల దిగుబడి ఎక్కువ వస్తుందని నమ్ముతున్నారు. అంతేకాకుండా మహిళలు, గ్రామస్తులు ఎక్కువగా వారి ఇళ్లలోకి నీటిని తీసుకెళ్లి అవసరాలకు వినియోగించుకుంటారు. ప్రజలు ఆ కాల్వలో నీటిని వినియోగించుకున్న తర్వాత నీరు కాల్వల ద్వారా సమీపంలోని గోదావరి నదిలో కలుస్తుంది. 45 సంవత్సరాలు అవుతున్నప్పటికీ అందులో నీటినిల్వలు కొద్దిగా కూడా తగ్గకపోవడం గమనార్హం. అంతేకాకుండా కొంత మంది రైతులు అందులో మోటార్లను దింపి వరి పంట సాగుకు నీటిని పారించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment