
పుష్కరాల పనులు పూర్తిచేయాలి
కాళేశ్వరం: మే 15నుంచి 26వరకు జరగనున్న సరస్వతీ నది పుష్కరాల అభివృద్ధి నిర్మాణ పనులను మే 4వరకు పూర్తిచేయాలని ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లను కలెక్టర్ రాహుల్‌శర్మ ఆదేశించారు. మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మితో కలిసి అభివృద్ధి పనులను సోమవారం పరిశీలించారు. ముందుగా జ్ఞానసరస్వతి (వీఐపీ)ఘాటు వద్ద నిర్మాణంలో ఉన్న పుష్కరఘాట్‌ను పరిశీలించి ఈఈ తిరుపతిరావుతో మాట్లాడారు. సరస్వతీ మాత విగ్రహ ఏర్పాటుకు జరుగుతున్న నిర్మాణ పనులను, శాశ్వత ప్రాతిపదికన నిర్మిస్తున్న మరుగుదొడ్ల పనులను పరిశీలించారు. ప్రధాన ఘాట్ వద్ద జరుగుతున్న మరుగుదొడ్ల పనులు, విద్యుత్ స్తంభాల ఏర్పాటు, స్వాగత తోరణం పనులు, పుష్కర ఘాట్లలో స్నానఘట్టాలు, నిర్మాణ పనులను ఆర్‌డబ్ల్యూఎస్ ద్వారా నిర్మిస్తున్న తాగునీటి ట్యాంక్ నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం దేవస్థానం ఈఓ కార్యాలయంలో అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మే నెలలో కాళేశ్వరంలో నిర్వహించే సరస్వతీ పుష్కరాలకు పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. కొన్నిచోట్ల శాశ్వత ప్రాతిపదికన పనుల నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు. త్వరితగతిన నిర్మాణ పనులను పూర్తిచేయాలని ఆదేశించారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా మరుగుదొడ్లు, తాగునీరు, పుష్కరఘాట్లలో స్నానఘట్టాలు, బట్టలు మార్చుకునే గదులు, చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టర్‌తో పాటు ఈఓ మహేష్, డీపీఓ నారాయణరావు, సూపరింటెండెంట్ శ్రీనివాస్, సీఐ రామచందర్‌రావు, స్థానికులు శ్రీనివాసరెడ్డి, అశోక్ ఉన్నారు.
చెట్లను తొలగించాలా! వద్దా!
కాళేశ్వరంలోని ఆర్చీగేటు నుంచి వీఐపీ ఘాటు వరకు రోడ్డు వెడల్పు పనులు జరుగుతున్నాయి. ఎడమ వైపున భారీ వృక్షాలు ఐదారు వరకు ఉన్నాయి. సోమవారం కలెక్టర్ రాహుల్‌శర్మ పనుల పరిశీలనకు రాగా కాంట్రాక్టర్లు వృక్షాలు తొలగిస్తామని చెప్పారు. ఆయన స్పందించి వృక్షాలను తొలగించవద్దని చెప్పారు.
కలెక్టర్ రాహుల్‌శర్మ
దేవస్థానం కార్యాలయంలో సమీక్ష