
నష్టపోయిన రైతులు అధైర్యపడొద్దు
మంగపేట: వడగండ్లవానతో పంట నష్టపోయిన రైతులు అధైర్యపడొద్దని కలెక్టర్ దివాకర అన్నారు. మండలంలో సోమవారం కురిసిన వడగండ్ల వర్షంతో తీవ్రనష్టం జరిగిన నర్సింహాసాగర్, మల్లూరు, గాంధీనగర్ గ్రామాల్లోని పంట పొలాలను అదనపు కలెక్టర్ మహేందర్‌జీ, ఏఓ చేరాలు, తహసీల్దార్ రవీందర్‌తో కలిసి కలెక్టర్ దివాకర మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులకు జరిగిన నష్టానికి ప్రభుత్వం నుంచి ఎకరాకు రూ.10 వేలు పరిహారం అందించేందుకు కృషి చేస్తామన్నారు. మల్లూరు, నర్సింహాసాగర్, చుంచుపల్లి, తిమ్మంపేట, బాలన్నగూడెం, తిమ్మంపేట రెవెన్యూ పరిధిలోని సుమారుగా 2,500 ఎకరాల్లో వరిపంట నష్టం జరిగినట్లు అధికా రులు ప్రాథమికంగా అంచనా వేశారని తెలిపారు. నష్టం జరిగిన అన్ని రకాల పంటలకు పరిహారం అందించనున్నట్లు తెలిపారు. పట్టా లేని, పోడు భూములు, కౌలు రైతులు పరిహారం పొందేందుకు పంట సాగుచేసినట్లు తహసీల్దార్ నుంచి ధ్రువీకరణ పత్రాన్ని తీసుకుని సర్వే బృందాలకు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో డీపీఓ దేవరాజు, ఎంపీడీఓ భద్రు, ఎంపీఓ మమత, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మైల జయరాంరెడ్డి, నాయకులు సోమ య్య, శివప్రసాద్, తదితరులు ఉన్నారు.
బ్రహ్మోత్సవాలపై కలెక్టర్ ఆరా
మండలంలోని మల్లూరు హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో మే నెలలో జరుగనున్న స్వామివారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఆలయ ఈఓ సత్యనారాయణను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈఓతో కలిసి ఆలయ పరిసరాలు, చింతామణి జలపాతం తదితర ప్రాంతాలను పరిశీలించారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
రైతులు ఆందోళన చెందొద్దు
ఏటూరునాగారం: అకాల వర్షం వల్ల నష్టపోయిన రైతులు ఆందోళన చెందొద్దని అడిషనల్ కలెక్టర్ సంపత్ (స్థానిక సంస్థల) అన్నారు. ప్రభుత్వ ఆదేశానుసారం మండలంలోని అల్లంవారిఘణపురం, శంకరాజుపల్లి, రొయ్యూర్, చెల్పాకలో ముళ్లకట్ట తదితర ప్రాంతాల్లో దెబ్బతిన్న వరిపంటలను ఆయన సంబంధిత అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అకాల వర్షం వల్ల వరిపైరు పూర్తిగా నేలమట్టం కావడంతో రైతులకు నష్టం జరిగిందన్నారు. ఏ ఏ ప్రాంతాల్లో వరి ఎక్కువ నష్టపోయిందో గుర్తించేందుకు క్షేత్రస్థాయిలో సర్వే చేయించడం జరుగుతుందన్నారు. నివేదిక ప్రకారం పూర్తి జాబితాను ప్రభుత్వానికి పంపించి రైతులకు పరిహారం అందేలా చూస్తామన్నారు. అంతేకాకుండా రేకులు గాలికి ఎగిరిపోయిన ఇళ్లను, దెబ్బతిన్న గుడిసెలను అడిషనల్ కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి రాంపతి, తహసీల్దార్ జగదీష్, ఆర్‌ఐ కిరణ్, ఎంపీఓ కుమార్, ఏఓ వేణుగోపాల్, ఏఈఓలు, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.
అన్నదాతలను ఆదుకుంటాం..
గోవిందరావుపేట: వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ అన్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో సోమవారం సాయంత్రం కురిసిన వడగండ్ల వానతో దెబ్బతిన్న పంటలు, గాలిదుమారంతో కూలిపోయిన ఇళ్లను ఆయన సంబంధిత అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. పూర్తి నివేదిక వచ్చాక నష్ట పరిహారం అంచనా వేసి రైతులకు న్యాయం చేకూరేలా చేస్తామన్నారు. మంత్రి సీతక్క ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందిస్తామని అన్నారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ జవహార్‌రెడ్డి, తహసీల్దార్ సృజన్‌కుమార్, రెవెన్యూ సిబ్బంది, తదితరులు ఉన్నారు.
రైతులకు ప్రభుత్వ అండ ఉంటుంది..
ములుగు రూరల్: ఈదురుగాలుల బీభత్సవానికి పంటలు నష్టపోయిన రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్‌గౌడ్ అన్నారు. మంగళవారం మండలంలోని మల్లంపల్లి, రాంచంద్రాపూర్, భూ పాల్‌నగర్, ముద్దునూరుతండా, శ్రీనగర్ గ్రామాల్లో నెలవాలిన మొక్కజొన్న పంటలను రాష్ట్ర మంత్రి సీతక్క ఆదేశాల మేరకు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నష్టపోయిన ప్రతి ఎకరాను వ్యవసాయ శాఖ అధికారులతో సర్వే చేయించి రైతులకు పరిహారం అందించేలా కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో చాంద్‌పాషా, భరత్, శ్యాం, రామకృష్ణారెడ్డి, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.
కలెక్టర్ దివాకర

నష్టపోయిన రైతులు అధైర్యపడొద్దు

నష్టపోయిన రైతులు అధైర్యపడొద్దు