
ప్రైవేట్ అభ్యర్థులకు ఐటీఐ పరీక్షలకు అర్హత
భూపాలపల్లి అర్బన్: ప్రభుత్వ అనుమతి పొందిన ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న అభ్యర్థులకు వివిధ ట్రెడ్‌లలో ప్రైవేట్ అభ్యర్థిగా పరీక్షలు రాసేందుకు అర్హత కల్పిస్తున్నట్లు స్థానిక ప్రభుత్వ ఐటీఐ కళా శాల ప్రిన్సిపాల్ జూమ్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత ట్రెడ్‌లో అభ్యర్థులు 3 సంవత్సరాలపైబడి సర్వీస్, నైపుణ్యత కలిగి ఉండాలని తెలిపారు. వారు పనిచేస్తున్న సంస్థ ధ్రువీకరణపత్రం, సంస్థ ఐడీ కార్డుతో వరంగల్ ప్రాంతీయ ఉపసంచాలకుల కార్యాలయంలో రూ.1,000 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
నేలవాలిన అరటితోటల పరిశీలన
చిట్యాల: మండలంలోని రాంచంద్రాపూర్ శివారులో సోమవారం వీచిన గాలిదుమారానికి అరటి పంటలు పూర్తిగా నేలవాలాయి. స్పందించిన ఉద్యాన శాఖ డివిజనల్ అధికారి సునీల్ బుధవారం ఆకుల సతీష్, గంపల మధుకర్, సూర సుధాకర్, క్యాతం భద్రయ్య, క్యాతం రాజయ్యలకు చెందిన అరటి పంటలను పరిశీలించారు. రెండు రోజులుగా వీస్తున్న గాలుల ప్రభావంతో అరటి తోటల్లో నష్టం వాటిల్లిందన్నారు. నష్టతీవ్రతపై ప్రాథమికంగా అంచనా వేసి జిల్లా అధికారులకు నివేదిక పంపించనున్నట్లు తెలిపారు. రైతులు ఆందోళన చెందొద్దని సూచించారు.