
భవిత.. భరోసా
దివ్యాంగులకు అండగా నిలుస్తున్న సెంటర్లు
ఏటూరునాగారం: శారీరంగా, మానసికంగా మందబుద్ధితో బాధపడుతున్న దివ్యాంగులకు భవిత సెంటర్లు భరోసాగా నిలుస్తున్నాయి. ఈ సెంటర్లను రాష్ట్ర ప్రభుత్వం సర్వశిక్ష అభియాన్ ద్వారా ప్రత్యేకంగా నెలకొల్పింది. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న దివ్యాంగులను గుర్తించి ఈ భవిత సెంటర్ల చేర్చి విద్యతో పాటు భోజనం, మానసికంగా ఎదిగేందుకు ప్రత్యేకమైన టీచర్లను ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తున్నారు. అంతేకాకుండా గ్రహణం ముర్రి, గ్రహణ శూల వంటి వారికి కూడా ఉచిత ఆపరేషన్లను కార్పొరేట్ ఆస్పత్రిలో శస్త్ర చికిత్సలు చేయిస్తున్నారు. ప్రతీ ఏడాది మే నెలలో ఇంటింటి సర్వే చేపట్టి దివ్యాంగులను గుర్తిస్తున్నారు. దివ్యాంగులై సదరన్ సర్టిఫికెట్లు లేని పిల్లలను కూడా గుర్తించి వారికి అవగాహన కల్పించి సర్టిఫి కెట్లు వచ్చే విధంగా ఐఆర్‌పీలు కృషి చేస్తున్నారు.
21 రకాల అంగవైకల్యం
2016 చట్టం ప్రకారం 21రకాల అంగవైకల్యం కలిగిన విద్యార్థులను గుర్తించారు. వారిని సెంటర్‌లో చేర్చి ఒక్కో సెంటర్‌లో 16మంది విద్యార్థులకు ఇద్దరు ప్రత్యేక టీచర్లను మాత్రమే కేటాయిస్తారు. ఇందులో ఒక్కో ఐఆర్‌పీకి 8మంది విద్యార్థులను కేటాయిస్తారు. ఐఆర్‌పీలు వ్యక్తిగత ప్రణాళికతో విద్యను ఆటపాటలతో బోధిస్తారు. అంతేకాకుండా భోజన వసతి కూడా కల్పిస్తారు. ఇదే కాకుండా ప్రతీ శనివారం ఇంటి వద్ద మంచంలో ఉండే పిల్లల వద్దకు వెళ్లి విద్యతో పాటు వ్యక్తిగత నైపుణ్యాలను నేర్పిస్తారు. బ్రెషింగ్, ఈటింగ్, కోంబింగ్, వాకింగ్‌తో పాటు దినచర్య అలవాట్లను తల్లిదండ్రుల సమక్షంలో నేర్పిస్తారు. దీనివల్ల మంచంలో ఉన్న పిల్ల లకు దినచర్యలు అలవాటు కావడంతో పాటు త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులకు దివ్యాంగులకు ఉచితంగా ప్రభుత్వం కల్పించే సౌకర్యాలు, ఉపకరణాలను సద్వినియోగం చేసుకోవాలని ఐఆర్‌పీలు తల్లిదండ్రులకు అవగాహన కల్పించి భవిత సెంటర్‌కు తీసుకొస్తున్నారు.
ప్రత్యేక అలవెన్సులు
భవిత కేంద్రాలకు వచ్చే విద్యార్థులకు ట్రాన్స్‌పోర్ట్ అలవెన్సులు, భవిత సెంటర్లకు రాలేని విద్యార్థులకు గ్రామాల్లోని తల్లిదండ్రుల సహాయంతో బడికి వెళ్లే పిల్లలకు ఎస్కార్ట్ అలవెన్సులు, దివ్యాంగులైన ఆడపిల్లలకు ఉపకార వేతనాలను ప్రభుత్వం అందిస్తోంది. అదేకాకుండా ప్రతీ ఏడాది మెడికల్ క్యాంప్‌లు, ఉపకరణాలు వీల్‌చైర్స్, చెవి, మూగ వారికి వినికిడి యంత్రాలు, ఆర్థో వారికి క్యాలిపర్స్, క్రచ్చస్ లాంటివి అలిమ్‌కో క్యాంప్ ద్వారా అందజేస్తారు. పిల్లలకు ఫిజియోథెరిపీ, స్పీచ్ ఽథెరపీ వైద్యులతో ప్రత్యేక థెరపీ సర్వీస్‌లను అందిస్తారు.
జిల్లాలో 12 మంది ఐఆర్‌పీలు
జిల్లాలోని 10 మండలాల్లో 3 భవిత సెంటర్లు ఉండగా 7నాన్ భవిత సెంటర్లు ఉన్నాయి. 12మంది ఐఆర్‌పీలు(విలీన విద్యా ఉపాధ్యాయులు)ఉన్నా రు. ఈ సెంటర్లు ఎంఈఓల పర్యవేక్షణతో నడుస్తాయి. జిల్లాలోని దివ్యాంగుల పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అధికారులు భవిత సెంటర్లను పరిశీలించి మరింత మెరుగుపరుస్తారు.
భవిత సెంటర్లలోని విద్యార్థుల వివరాలు
విద్యతో పాటు భోజన వసతి
ప్రతీ ఏడాది ఉపకరణాల పంపిణీ

భవిత.. భరోసా