కాజీపేట అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖలో పైలెట్ ప్రాజెక్ట్‌గా చేపట్టిన స్లాట్ బుకింగ్ పద్ధతి తమకు కుడా కావాలని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలతో పాటు ఆయా పరిధి భూక్రయవిక్రయదారులు కోరుకుంటున్నారు. భూ దస్తావేజుల రిజిస్ట్రేషన్ నిమిత్తం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అడుగుపెడితే ఏ సమయానికి రిజిస్ట్రేషన్ పూర్తవుతుందో.. సబ్ రిజిస్ట్రార్ ఎప్పుడు పిలుస్తాడో తెలియక ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాస్తున్నారు. ఈ క్రమంలో పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ ప్రక్రియతో 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తవడంతోపాటు మరో 15 నిమిషాల్లో దస్తావేజులు చేతికందుతున్నాయి. దీంతో స్లాట్ బుకింగ్ విధానం అమలుకు అన్ని కార్యాలయాల నుంచి డిమాండ్ పెరుగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధి వరంగల్‌ఫోర్ట్, వరంగల్ రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈనెల 10న ప్రారంభించిన స్లాట్ బుకింగ్ పైలెట్ ప్రాజెక్ట్ విజయవంతమైంది. కోరుకున్న సమయానికి.. కోరుకున్న రోజు రిజిస్ట్రేషన్ పూర్తి కావడంతో భూక్రయవిక్రయదారులతో పాటు రుణాల కోసం బ్యాంకులకు వెళ్లే వారు సమయానికి దస్తావేజులు చేతికి రావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్ ఆర్వో, భీమదేవరపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్, జనగామ, పరకాల, కొడకండ్ల, మహబూబాబాద్, ములుగు, నర్సంపేట, వర్ధన్నపేట, భూపాలపల్లి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు స్లాట్ బుకింగ్ ప్రక్రియ కోసం ఎదురుచూస్తున్నాయి.
తగ్గనున్న పనిభారం
నాన్ స్లాట్ రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తున్న తరుణంలో సబ్ రిజిస్ట్రార్లు త్వరగా పనులు ముగించుకుని ఇంటికి వెళ్లే ఆస్కారం లేక ఒక్కోరోజు రాత్రి 8 గంటల వరకు సైతం కార్యాలయాల్లో ఉండాల్సి వస్తోంది. స్లాట్ బుకింగ్ ప్రక్రియలో భాగంగా ఉదయం 10.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పని సమయాలతో సబ్ రిజిస్ట్రార్లకు పనిభారం తగ్గడంతో పాటు భూక్రయవిక్రయదారులకు సమయం కలిసి వస్తుంది.
రోజుకు 53 స్లాట్ బుకింగ్స్..
ప్రతి రోజు ఉదయం 10.30 నుంచి 1.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 24 చొప్పున స్లాట్ బుకింగ్స్ కల్పించారు. అలాగే వృద్ధులు, దివ్యాంగులు, పేషంట్ల కోసం ప్రత్యేకంగా సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు 5 స్లాట్ బుకింగ్స్ ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించారు. ఈ విధానంతో రిజిస్టేషన్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
స్లాట్ బుకింగ్‌తో మెరుగైన సేవలు..
భూక్రయవిక్రయదారులు తాము ఎంచుకున్న రోజు, సమయానికి దస్తావేజుల రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు స్లాట్ బుకింగ్ విధానం ఎంతో ఉపయోగపడుతుంది. మెరుగైన, త్వరితగతిన సేవలు అందుతాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వేచి ఉండాల్సిన అవసరం లేదు. స్లాట్ బుక్ చేసుకుని సరైన సమయానికి వస్తే చాలు. వృద్ధులు, అనారోగ్యంగా ఉన్నవారికి సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు ప్రత్యేక సమయం కేటాయించడంతో ఇబ్బందులు తలెత్తవు.
– ఆనంద్, సబ్ రిజిస్ట్రార్, వరంగల్‌ఆర్వో
15 నిమిషాల్లో ప్రక్రియ పూర్తి
ఎదురుచూస్తున్న
11 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు
తగ్గనున్న పనిభారం, సమయాభావం
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రస్తుతం రోజువారీ జరిగే రిజిస్ట్రేషన్లు ఇలా...
భీమదేవరపల్లి : 20 నుంచి 30
స్టేషన్‌ఘన్‌పూర్ : 25 నుంచి 30
జనగామ : 40 నుంచి 55
కొడకండ్ల : 7 నుంచి 15
మహబూబాబాద్ : 45 నుంచి 60
ములుగు : 10 నుంచి 20
వరంగల్ ఆర్వో : 70 నుంచి 110
వరంగల్ రూరల్ : 25 నుంచి 35
వరంగల్‌ఫోర్ట్ : 25 నుంచి 40
వర్ధన్నపేట : 6 నుంచి 15
నర్సంపేట : 20 నుంచి 35
పరకాల : 15 నుంచి 25
భూపాలపల్లి : 20 నుంచి 30
మాకూ కావాలి ‘స్లాట్ బుకింగ్’