
అంబేడ్కర్ అందరివాడు
ములుగు: ప్రజలందరికీ సమానహక్కులు ఉండాలనే లక్ష్యంతో భారత రాజ్యాంగాన్ని రచించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ భీమ్‌రావు అంబేడ్కర్ అందరివాడని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కాన్ఫరెన్స్‌హాల్‌లో అదనపు కలెక్టర్ సంపత్‌రావు(స్థానిక సంస్థలు) అధ్యక్షతన సోమవారం నిర్వహించిన అంబేడ్కర్ 134వ జయంతికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై దళిత సంఘాల నాయకులతో కలిసి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. అంటరానితనాన్ని రూపు మాపిన మహాగొప్ప వ్యక్తి అంబేడ్కర్ అన్నారు. కులమతాలకు అతీతంగా రాజ్యాంగాన్ని రూపొందించారని తెలిపారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, వర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషి చేశారని వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దళిత పక్షపాతి అన్నారు. దళితుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.
అంబేడ్కర్ సేవలు మరువలేనివి..
అదనపు కలెక్టర్ సంపత్‌రావు మాట్లాడుతూ అంబేడ్కర్ సేవలు మరువలేనివని అన్నారు. దేశంలో గొప్ప నాయకుల విగ్రహాలను వారి మరణాంతరం మాత్రమే ఏర్పాటు చేశారని తెలిపారు. కానీ అంబేడ్కర్ బతికి ఉండగానే 1950లో విగ్రహాన్ని ఏర్పాటు చేశారంటే ఆయన గొప్పతనం అర్ధం అవుతుందని వివరించారు. అంబేడ్కర్ ఏర్పాటు చేసుకున్న లైబ్రరీలో 50వేల పుస్తకాలను పొందుపరిచి వాటిని చదివారని గుర్తు చేశారు. అంతకు ముందు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ అధికారి లక్ష్మణ్, డీపీఓ దేవరాజ్, డీసీఓ సర్దార్‌సింగ్, జిల్లా పరిశ్రమల అధికారి సిద్ధార్థరెడ్డి, కలెక్టరేట్ ఏఓ రాజ్‌కుమార్, జేఏసీ అధ్యక్షుడు ముంజాల భిక్షపతిగౌడ్, ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ అండ్ విజిలెన్స్ కమిటీ సభ్యులు జన్ను రవి, మహేష్‌నాయక్, ఆయా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్