
వైభవంగా అయ్యప్ప విగ్రహ ప్రతిష్ఠాపన
ఏటూరునాగారం: మండల కేంద్రంలో శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. భద్రకాళి దేవస్థానం అర్చకులు శేషు, మల్లవజ్జుల రామకృష్ణ శర్మలతో పాటు మరో 9మంది అర్చకులు వేదమంత్రాలతో కార్యక్రమాన్ని నిర్వహించారు. మొదటగా ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన అనంతరం ఉదయం 11.08గంటలకు యంత్ర ప్రతిష్ట అనంతరం అయ్యప్ప విగ్రహ ప్రతిష్ఠతో పాటు ప్రాణ ప్రతిష్ట, దృష్టి కుంభము, బలిహరణ ఇతర కార్యక్రమాలను వేద పండితులు నిర్వహించారు. అయ్యప్ప విగ్రహ ప్రతిష్టాపనతో పాటు గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శివలింగం, నాగేంద్రస్వామి, మాలికాపు రత్తమ్మ విగ్రహాలను ప్రతిష్ఠించారు. సాయంత్రం సమయంలో మహా పడిపూజను కనులపండువగా భజన కార్యక్రమాలతో నిర్వహించారు. ఈ కార్యక్రమాలను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి 5వేల మంది తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. అయ్యప్ప విగ్రహ ప్రతిష్ఠాపన సమయంలో భక్తులు స్వామియే శరణం అయ్యప్ప అంటూ నినదించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రజలకు మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ గౌరీ శంకర్‌తో పాటు కమిటీ సభ్యులు ఇతర ఆలయాల చెందిన కమిటీ సభ్యులు పాల్గొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వసతులు ఏర్పాటు చేశారు.
ప్రముఖుల దర్శనం
అయ్యప్పస్వామి విగ్రహ ప్రతిష్ఠాపనకు స్థానిక ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడుకు కాకులమర్రి లక్ష్మీనర్సింహరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకన్న, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ బడే నాగజ్యోతిలు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక సీఐ శ్రీనివాస్, ఎస్సై తాజొద్దీన్‌లు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వేదపండితుడు రాధాకృష్ణశర్మ, బోడ సత్యం, అలి శ్రీనివాస్, బోడ శంకర్, గోపి, నర్సింహరావు అయ్యప్పస్వామి మాలధారులు పాల్గొన్నారు.
విద్యుద్దీపాల వెలుగులో దేవాలయం
ఆలయంలో ప్రత్యేక పూజలు..
ప్రముఖుల హాజరు

వైభవంగా అయ్యప్ప విగ్రహ ప్రతిష్ఠాపన

వైభవంగా అయ్యప్ప విగ్రహ ప్రతిష్ఠాపన