
డెడ్ స్టోరేజీకి చేరువలో..
లక్నవరం సరస్సులో అడుగంటుతున్న నీరు
గోవిందరావుపేట: లక్నవరం సరస్సు కళ చెదురుతున్నది. నీటితో కళకళలాడే సరస్సులో ఎండమావులు కమ్ముకుంటున్నాయి. లక్నవరం పూర్తి నీటి సామర్థ్యం 36 అడుగులు కాగా.. ఇప్పటికే నీటిమట్టం 14 అడుగులకు చేరింది. వేసవి తాపానికి తోడు యాసంగి పంట అధికారికంగా 4,150 ఎకరాలకు నీరు అందిస్తుండగా..అనధికారికంగా మరో 500 ఎకరాలు పంట సాగవుతోంది. ఇటీవల కురిసిన వర్షాలకు చివరి ఆయకట్టు రైతులు ఊపిరి పీల్చుకున్నారు. లేదంటే లక్నవరం సరస్సులోని నీరు ఇప్పటికే అడుగంటేది. నీరు లేక పర్యాటకుల రద్దీ తగ్గి, లక్నవరం సరస్సు వెలవెలబోతోంది. వచ్చిన కొద్దిమంది బోటు షికారు, అడ్వైంచర్ గేమ్స్ లేక నిరాశ చెంది వెనుతిరుగుతున్నారు. అగో వచ్చే, ఇగో వచ్చే అన్న చందంగా ఉంది లక్నవరంలోకి గోదావరి జలాలను తరలించే ప్రక్రియ. రామప్ప రిజర్వాయర్ నుంచి లక్నవరం వరకు గ్రావిటీ కెనాల్ ద్వారా నీటిని తరలించే ప్రాజెక్టుకు మోక్షం కలగడం లేదు. ప్రస్తుతం అడుగంటుతున్న జలాశయం మళ్లీ కళకళలాడాలంటే వర్షాలు సమృద్ధిగా పడటమే ఏకై క మార్గం.
దేవాదుల నీటితో నింపితేనే జలకళ
లక్నవరం సరస్సులో 365 రోజులు నీరు ఉండాలంటే దేవాదుల నీటితో లక్నవరం సరస్సును నింపడం ఒక్కటే మార్గం. వర్షాల వల్ల చెరువులోకి నీరు సమృద్ధిగా వచ్చినా అది కాస్త పంటలకు, మేడారం జాతరకు నీళ్లు వాడుతున్నంందున్న ప్రతిఏటా ఏప్రిల్, మే నె వచ్చేసరికి నీటి సామర్థ్యం డెడ్ స్టోరేజీకి పడిపోతుంది. దీంతో రైతన్నలకు, పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా లక్నవరం లో 365 రోజులు నీరు ఉండేలా ప్రభుత్వం రామప్ప సరస్సు నుంచి ప్రత్యేకంగా పైపులైన్ వేయడం కోసం భూసేకరణ పనులు చేపట్టింది. కాల్వ నిర్మాణానికి 145.36 ఎకరాల భూములు అవసరమవుతాయని సాగునీటి పారుదల శాఖ అధికారులు గుర్తించారు. ఈ మేరకు చర్యలు చేపట్టగా రైతులు పరిహారం విషయంలో ఒప్పుకోకపోవడంతో మళ్లీ అధికారులు అంచనా వ్యయాన్ని పెంచి ప్రభుత్వానికి నివేదించారు. ఆమోదం లభించకపోవడంతో 6 ఏళ్లు గడిచాయి. ఇటీవల మంత్రి సీతక్క పనులు పూర్తయ్యేలా అటు ప్రభుత్వంతో, ఇటు భూమి కోల్పోతున్న రైతులతో చర్చలు జరిపారు.
●
తగ్గిన పర్యాటకులు.. ఒడ్డుకు చేరిన బోట్లు
మూలనపడిన వాటర్ స్పోర్ట్స్,
అడ్వెంచర్ గేమ్‌లు
గ్రావిటీ కెనాల్ ద్వారా గోదావరి జలాలను తరలిస్తేనే కళకళ
రెండేళ్లుగా పూర్తిగా
ఎండిపోతూ..
గడిచిన రెండేళ్లలో లక్నవరం సరస్సు పూర్తిగా ఎండిపోయింది. దీంతో వేలాడే వంతెనల కింది నుంచి మట్టి రోడ్డుపై సైతం వాహనాలు వెళ్లేవి. ఈసారి కూడా చెరువులో నీటిమట్టం డెడ్ స్టోరేజీకి వెళ్లే ప్రమాదం ఉంది. యాసంగి పంటల సాగుకు చివరి తడి నీరు అవసరం ఉంది. దీంతో ప్రస్తుతం 14 అడుగుల నీటిమట్టం ఉండగా మరో తడికి 5, 6 అడుగుల నీరు అవసరం ఉంది. 20 రోజుల్లో వరి కోతలు పూరై ధాన్యం ఇంటికి చేరుకుంటుంది. మే మొదటి వారంలోగా సరస్సులోని నీరు పూర్తిగా అడుగంటిపోయే ప్రమాదం ఉంది. లక్నవరం పూర్తిగా అడుగంటిపోతే చుట్టు పక్కల ప్రాంతాల్లోని చెరువులు, బావులు ఎండిపోయే ప్రమాదం ఉంటుందని ప్రజలు వాపోతున్నారు.