
వాతావరణం
జిల్లాలో ఉదయం వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండతో పాటు ఉక్కపోతగా ఉంటుంది. వడగాలలు వీచే అవకాశం ఉంది.
ఉల్లాస్, న్యూఇండియా లిట్రసీ అమలుచేయాలి
● కలెక్టర్ దివాకర
ములుగు: ఉల్లాస్, న్యూ ఇండియా లిట్రసీ జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ దివాకర అన్నారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో ఆయా సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డీఆర్డీఏ ఆధ్వర్యంలో జిల్లాలోని మహిళా సంఘాలలో సభ్యులుగా ఉన్న నిరక్షరాస్యులను గుర్తించి వారి వివరాలను సేకరించి విద్యాశాఖకు అందించాలని సూచించారు. స్వచ్ఛందంగా వలంటీర్లను ఏర్పాటు చేసుకొని షెడ్యూల్ ప్రకారం అక్షరాస్యత పెంపొందించే కార్యక్రమాలను చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు మహేందర్‌జీ, సంపత్‌రావు, డీఈఓ పాణిని, వైద్యశాఖ అధికారి గోపాల్‌రావు, డీడబ్ల్యూఓ శిరీష, డీపీఓ ఒంటేరు దేవరాజ్, ఇంటర్మీడియట్ జిల్లా అధికారి చంద్రకళ, అడల్ట్ ఎడ్యూకేషన్ నోడల్ అధికారి వేణుగోపాల్, ఓపెన్ స్కూల్ సొసైటీ జిల్లా బాధ్యులు అప్పని జయదేవ్, సమగ్ర శిక్ష కో ఆర్డినేటర్ సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.
దర్యాప్తును ముమ్మరం చేయాలి
ములుగు: దొంగతనాలు, ఆర్థిక నేరాలపై నమోదయ్యే కేసుల వివరాలను సేకరించి దర్యాప్తును ముమ్మరం చేయాలని పోగొట్టుకున్న నగదు, వస్తువులను బాధితులకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ డాక్టర్ శబరీశ్ సూచించారు. జిల్లా కేంద్రంలోని పోలీసు శాఖ కాన్ఫరెన్స్ హాల్‌లో మంగళవారం నిర్వహించిన నెలవారి నేర సమీక్ష సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. పాత కేసుల దర్యాప్తులో పురోగతిని పరిశీలించి తగిన విధంగా వివరాలను సేకరించి సమర్పించాలన్నారు. వేసవి కాలంలో ఉద్యోగులు, సామాన్య ప్రజలు సెలవులపై బయటికి వెళ్లే సమయంలో ఎక్కువగా దొంగతనాలు జరిగే ప్రమాదం ఉందన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలను నివారించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మహిళలపై జరిగే నేరాలపై వీలైనంత వరకు సమాచారం సేకరించాలని ఆదేశించారు. యువత, ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా ఆయా పోలీస్ స్టేషన్ల వారీగా విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, డీఎస్పీ రవీందర్, డీసీఆర్బీ డీఎస్పీ కిశోర్‌కుమార్, ఎస్‌బీ సీఐ శంకర్, సీఐలు శ్రీనివాస్, కుమార్, రవీందర్, ఎస్సైలు సతీశ్, కమలాకర్, శ్రీకాంత్‌రెడ్డి, తాజుద్దీన్, టీవీఆర్ సూరి, రాజ్‌కుమార్, కృష్ణప్రసాద్ పాల్గొన్నారు.