
లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే చర్యలు
ములుగు: పీసీ–పీఎన్‌డీటీ యాక్ట్ ప్రకారం.. ఆస్పత్రుల్లో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యంతో సమీక్ష నిర్వహించారు. క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ ప్రకారం.. నియమ, నిబంధనలు పాటించాలన్నారు. ఆస్పత్రుల్లో అందించే సేవల ధరల పట్టికను, వైద్యుల పేర్లను ప్రదర్శించాలన్నారు. బయో మెడికల్ వేస్ట్ మేనేజ్‌మెంట్ సర్టిఫికెట్, ఫైర్ సర్టిఫికెట్ కచ్చితంగా ఉండాలన్నారు. లేకపోతే రూ.10 వేల నుంచి రూ.5 లక్షల వరకు జరిమానా ఉంటుందని హెచ్చరించారు. ప్రతీ నెల ప్రైవేట్ నర్సింగ్ హోంలో అందించిన వైద్య సేవలను, హెల్త్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో 5వ తేదీ వరకు నమోదు చేయాలన్నారు. వర్షాకాలంలో మలేరియా, డెంగ్యూ పరీక్షలు చేసే సమయంలో పాజిటివ్‌గా నిర్ధారణ అయితే వెంటనే జిల్లా కార్యాలయానికి సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ రణధీర్, డెమో సంపత్, కమ్యూనిటీ హెల్త్ అధికారి పూర్ణ సంపత్‌రావు, ఎస్‌ఓ స్వరూపారాణి, మానిటరింగ్ సూపర్‌వైజర్ సురేశ్‌బాబు, డీఈఓ నిఖిల్, ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యం, తదితరులు పాల్గొన్నారు.