21న ‘పేట’కు సీఎం రాక | - | Sakshi
Sakshi News home page

21న ‘పేట’కు సీఎం రాక

Published Tue, Feb 18 2025 1:12 AM | Last Updated on Tue, Feb 18 2025 1:11 AM

21న ‘

21న ‘పేట’కు సీఎం రాక

నారాయణపేట: ఈ నెల 21న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నారాయణపేటకు రానున్నారని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ తెలిపారు. ఈ మేర కు సోమవారం ఆమె హెలీప్యాడ్‌ స్థలాన్ని ఎస్పీ యోగేష్‌ గౌతమ్‌తో కలిసి పరిశీలించారు. అలాగే ఫొటో ఎగ్జిబిషన్‌, స్టేజీ తది తర ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ముఖ్యమంత్రి పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నట్లు, వాటిలో మెడికల్‌ కళాశాల టీచింగ్‌ హాస్పిటల్‌, 100 పడకల ఆస్పత్రి, నర్సింగ్‌ కళాశాల, రెండు పోలీస్‌స్టేషన్ల భవన నిర్మాణాలు, పెట్రోల్‌ బంక్‌, మహిళా సమాఖ్య భవనాలు ప్రారంభించనున్నారు. సీఎం పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని ఆమె అధికారులను ఆదేశించారు.

కల్తీ ఆహారం విక్రయిస్తే కఠిన చర్యలు

కల్వకుర్తి టౌన్‌: హోటళ్లు, రెస్టారెంట్లలో కల్తీ ఆహారం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ మనోజ్‌ కుమార్‌ హెచ్చరించారు. సోమవారం పట్టణంలోని పలు హోటళ్లు, టిఫిన్‌ సెంటర్లు, రెస్టారెంట్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. శుభ్రత పాటించని సుప్రభాత్‌, ఎస్‌ఆర్‌ గ్రాండ్‌తో పాటు పలు టిఫిన్‌ సెంటర్ల నిర్వాహకులకు నోటీసులు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. అదే విధంగా ఆయా హోటళ్లలో ఆహార పదార్థాల శాంపిల్స్‌ సేకరించి ల్యాబ్‌కు పంపించామన్నారు. శాంపిళ్లలో ఏమైనా కల్తీ జరిగినట్టు తేలితే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామన్నారు.

జాగ్రత్తలు పాటించాలి

నాగర్‌కర్నూల్‌ క్రైం: విద్యార్థులు కంటిచూపుపై నిర్లక్ష్యం చేయరాదని.. ముందస్తు జాగ్రత్తలు పాటించాలని జిల్లా జనరల్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డా.రఘు సూచించారు. సోమవారం జిల్లా జనరల్‌ ఆస్పత్రిలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ ఎం.వెంకటదాసుతో కలిసి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రత్యేక కంటివైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతేడాది పాఠశాల ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో 50,780 మంది విద్యార్థులకు రెండు విడతలుగా కంటి పరీక్షలు నిర్వహించి.. 1,893 మందికి దృష్టిలోపాలు ఉన్నట్లు గుర్తించినట్లు వివరించారు. వీరి కోసం నాగర్‌కర్నూల్‌, అచ్చంపేట ఆస్పత్రుల్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వచ్చేనెల ఐదో తేదీ వరకు శిబిరాలు కొనసాగుతాయన్నారు. విద్యార్థులకు కంటివైద్య నిపుణులచే పరీక్షలు నిర్వహించి.. అవసరమైన మందులు, కంటి అద్దాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్‌ఎంఓ డా.రవిశంకర్‌, కంటివైద్య నిపుణులు డా.శైలజ, డా.రోహిత్‌, డా.దశరథ్‌, ఆర్‌బీఎస్‌కే డాక్టర్‌ అక్బరుద్దీన్‌ పాల్గొన్నారు.

శ్రీశైలం యాత్రికులకు

24 గంటలు అనుమతి

మన్ననూర్‌: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీశైలం వెళ్లే యాత్రికుల సౌకర్యార్థం ఈ నెల 23 నుంచి మార్చి 1వ తేదీ వరకు అటవీశాఖ చెక్‌పోస్టుల ద్వారా 24 గంటలు వాహనాల రాకపోకలకు అనుమతి ఇస్తున్నట్లు డీఎఫ్‌ఓ రోహిత్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొంతకాలంగా వన్యప్రాణుల సంరక్షణలో భాగంగా రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకు మన్ననూర్‌ చెక్‌పోస్టు వద్ద రాకపోకలు నిలిపివేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల చెందిన శివమాలధారులు, భక్తుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని ఈ అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. అయితే అటవీ ప్రాంతంలో ప్రయాణించే క్రమంలో ఎలాంటి శబ్దం చేయరాదన్నారు. వాహనాలు గంటకు 40 కి.మీ. వేగంతో మాత్రమే ప్రయాణించాలని సూచించారు. ప్రయాణ సమయంలో భక్తులు ఎలాంటి ప్లాస్టిక్‌ వాడకూడదని.. అటవీ ప్రాంతంలో వాహనాలు నిలుపరాదని తెలిపారు. అటవీ ప్రాంతంలో మద్యం తాగడం, మంటలు వేసుకోవడాన్ని పూర్తిగా నిషేధించినట్లు పేర్కొన్నారు. పాదయాత్రగా వెళ్లే భక్తులు అధికారులు గుర్తించిన మార్గాల్లో మాత్రమే రాకపోకలు సాగించాలని కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
21న ‘పేట’కు సీఎం రాక 
1
1/1

21న ‘పేట’కు సీఎం రాక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement