ఆరు గ్యారంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలి
వనపర్తి రూరల్: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు. సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని దళితవాడ, చిట్యాల రోడ్డులోని డబుల్‌బెడ్రూం ఇళ్లు, చందాపూర్ రోడ్డులోని పీర్లగుట్ట గంగిరెద్దుల కాలనీల్లో ప్రజా సమస్యలపై సర్వే నిర్వహించారు. అనంతరం సీఐటీయూ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జాన్‌వెస్లీ మాట్లాడారు. జిల్లా కేంద్రంలోని దళితవాడలో లోఓల్టేజీ, శ్మశానవాటిక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. దళితవాడ కందకంలో నిర్మించిన కూరగాయల మార్కెట్‌ను ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నారు. చిట్యాల రోడ్డులోని డబుల్‌బెడ్రూం ఇళ్ల వద్ద తాగునీరు, వీధిలైట్లు, అంతర్గత రోడ్లు, మరుగుదొడ్లు, రేషన్‌షాపు లేక అవస్థలు పడుతున్నారని.. వెంటనే సమస్యలన్నింటినీ పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ కళాశాల ప్రహరీని అనుసరించి చిరు వ్యాపారులు, మెకానిక్‌లు ఏర్పాటు చేసుకున్న డబ్బాలను రోడ్డు విస్తరణలో తొలగించడంతో రోడ్డున పడ్డారని.. వారికి అడ్డాలు చూపించి ఆదుకోవాలని కోరారు. పీర్లగుట్ట గంగిరెద్దుల కాలనీలో ప్రజలకు ఇళ్ల స్థలాలు కేటాయించడంతో మౌలిక వసతులు కల్పించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 500లకే గ్యాస్ సిలిండర్, మహిళలకు రూ. 2,500 చొప్పున ఇవ్వడంతో పాటు వృద్ధాప్య పింఛన్ రూ. 4వేలకు పెంచుతామని చెప్పి నేటికీ అమలు చేయడం లేదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక అంబేడ్కర్ చౌరస్తాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యవర్గ సభ్యురాలు ఎ.లక్ష్మితో కలిసి జాన్‌వెస్లీ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, జబ్బార్, రాజు, పట్టణ కార్యదర్శి పరమేశ్వరాచారి, మధన్, బాలస్వామి, గట్టయ్య, రాములు, శ్రీను, బాలరాజు, రాబర్ట్, మద్దిలేటి, మన్యం, సాయిలీల పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment