నల్గొండ: కూతురు బతుకు ఆగమైందని మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నకిరేకల్‌లోని కాటమయ్య బజారుకు చెందిన దొమ్మాటి రామలక్ష్మయ్య రిటైర్డ్ టీచర్. ఇతడి భార్య మంగమ్మ అలియాస్ మమత (48) వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇద్దరు కుమార్తెల వివాహం జరిగినప్పటికీ పెద్ద కూతురు ఉషారాణి నాలుగేళ్ల క్రితం విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి ఆమె తల్లిదండ్రుల వద్ద ఉంటోంది.
చిన్న వయసులోనే కూతురుకు విడాకులు తీసుకోవడంతో తల్లి మంగమ్మ మానసికంగా కుంగిపోయి ఈనెల 29న శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగింది. అపస్మారస్థితిలో పడి ఉన్న ఆమెను పక్కింట్లో ఉంటున్న సోదరుడు జనార్దన్ చూసి తొలుత స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి, అక్కడి నుంచి నల్లగొండ, హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
రెండు రోజుల చికిత్స అనంతరం ఆమెను సోమవారం నకిరేకల్‌కు తీసుకువచ్చారు. ఇంటికి వద్దకు వచ్చిన తరువాత మరోసారి మమత అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మంగమ్మ మృతి చెందిందని డాక్టర్లు నిర్ధారించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు.
మృతురాలి భర్త రామలక్ష్మయ్య ఫిర్యాదు మేరకు సీఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ సుధీర్‌కుమార్ తెలిపారు. కాగా, మంగమ్మ మృతదేహానికి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో పాటు నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, టీపీసీసీ నేత దైద రవీందర్ నివాళులర్పించి సంతాపం తెలపారు.
Comments
Please login to add a commentAdd a comment