జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాల్లో కొరత
కోరుకున్న కంపెనీ బీర్లు దొరకడం లేదని మద్యం ప్రియుల ఆవేదన
లిక్కర్‌కు పెరిగిన డిమాండ్
నల్లగొండ రూరల్: జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాల్లో బీర్ల కొరత ఏర్పడింది. చాలా వరకు వైన్స్‌ల ఎదుట బీర్లు.. నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. దీంతో లిక్కర్‌కు డిమాండ్ పెరిగింది. జిల్లా వ్యాప్తంగా 155 మద్యం దుకాణాలు, 21 బార్లు ఉండగా.. నల్లగొండలోని లిక్కర్ డిపోకు వచ్చిన బీర్లను ఎకై ్సజ్ అధికారులు ఒక్కో మద్యం దుకాణానికి రోజుకు 80 పెట్టెల (ఒక పెట్టెలో 12 బీర్లు) చొప్పున సరఫరా చేస్తున్నారు. వేసవికి తోడు ఈ నెలలో శుభకార్యాలు ఎక్కువగా ఉండటంతో బీర్లకు డిమాండ్ పెరిగింది.
కానీ, మద్యం ప్రియులకు వారు కోరుకున్న కంపెనీ బీర్లు లభించడం లేదు. మద్యం షాపుల వద్ద కేవలం ఫలానా కంపెనీకి చెందిన బీర్లు మాత్రమే ఉన్నాయనే బోర్డులు పెడుతున్నారు. అవి కూడా నిమిషాల వ్యవధిలోనే అమ్ముడుపోతున్నాయి. కోరుకున్న బీర్లు దొరక్కపోవడంతో మద్యం ప్రియులు లిక్కర్ కొనుగోలు చేస్తున్నారు. దీంతో గతేడాది ఏప్రిల్‌తో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్‌లో లిక్కర్ అమ్మకాలు పెరిగాయి. ఇదే అదునుగా కొన్ని ప్రాంతాల్లో బెల్టు షాపుల్లో ఎక్కువ ధరకు బీర్లు అమ్ముతున్నట్లు సమాచారం.
డిమాండ్‌కు తగినట్లుగా లేని సరఫరా
నల్లగొండలోని లిక్కర్ డిపో నుంచి నల్లగొండ జిల్లాలోని 155 వైన్స్‌లు, 21 బార్లు, సూర్యాపేట జిల్లాలోని 99 వైన్స్‌లు, 16 బార్లకు రోజుకు 20వేల నుంచి 25వేల పెట్టల బీర్లు సరఫరా చేస్తున్నామని ఎకై ్సజ్ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. బీర్ల దిగుమతిలో తేడా లేదని, వేసవి కారణంగా బీర్లకు డిమాండ్ పెరగగా.. అందుకు తగినట్లుగా బీర్ల సరఫరా లేకపోవడంతో మద్యం షాపుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శమిస్తున్నాయని పేర్కొన్నారు.
పెరిగిన డిమాండ్..
మద్యం డిపోకు రోజు 20వేల నుంచి 25వేల పెట్టెల బీర్లు దిగుమతి అవుతున్నాయి. ఈ బీర్లను అన్ని షాపులకు రేషన్ ప్రకారం సరఫరా చేస్తున్నారు. ఎకై ్సజ్ అధికారులు గతేడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు లిక్కర్ డిపో నుంచి మద్యం దుకాణాలకు 1,30,379 పెట్టెల బీర్లు సరఫరా చేయగా.. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు 1,62,227 పెట్టెల బీర్లు సరఫరా చేశారు. గతేడాది ఏప్రిల్ నెలతో పోల్చితే ఈసారి 31,848 పెట్టెల బీర్లు అదనంగా సరఫరా చేశారు. గతేడాది ఏప్రిల్ నెలలో మొదటి 15 రోజులకు గాను రూ.21.25కోట్ల ఆదాయం రాగా ఈ ఏడాది ఏప్రిల్ నెల మొదటి 15 రోజుల్లో రూ.27.25కోట్ల ఆదాయం లభించింది.
మొత్తంగా ఈ ఏడాది రూ.6 కోట్ల అదనపు ఆదాయం సమకూరింది. అదేవిధంగా గతేడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు 75 వేల పెట్టెల లిక్కర్ అమ్మడం ద్వారా రూ.57.20కోట్ల ఆదాయం రాగా ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఒక లక్షా 31 వేల పెట్టెల లిక్కర్ అమ్మడం ద్వారా రూ.93.75కోట్ల ఆదాయం వచ్చింది. లిక్కర్ ద్వారా ఈ ఏడాది ఏప్రిల్ నెల మొదటి 15 రోజుల్లో రూ.36.55కోట్ల ఆదాయం అదనంగా సమకూరింది.
Comments
Please login to add a commentAdd a comment