2008 డీఎస్సీ అభ్యర్థులకు పోస్టింగ్
ఫ నియామక ఉత్తర్వులు జారీ చేసిన డీఈఓ భిక్షపతి
నల్లగొండ : 2008 డీఎస్సీలో నష్టపోయిన బీఈడీ అభ్యర్థులకు కాంట్రాక్టు పద్ధతిన ఉద్యోగాలు ఇచ్చేందుకు విద్యాశాఖ ఆదేశాలు ఇవ్వడంతో డీఈఓ బిక్షపతి శనివారం కౌన్సిలింగ్ నిర్వహించి పోస్టింగ్ ఆర్డర్లు అందజేశారు. 2008లో నిర్వహించిన డీఎస్సీలో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది నష్టపోయారు. దాంతో వారంతా తాము అర్హులమని.. మాకు ఉద్యోగాలు ఇవ్వాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇటీవల న్యాయస్థాన ఆదేశాలతో రాష్ట్ర విద్యాశాఖ వారిని కాంట్రాక్టు పద్ధతిలో విధుల్లో తీసుకునేందుకు అంగీకరించింది. దీంతో జిల్లాలో 75 మంది అభ్యర్థులకు శనివారం డీఈఓ కార్యాలయంలో నియామక ఉత్తర్వులు అందజేశారు. వీరికి ప్రతి నెల రూ.31,040 వేతనం ఇవ్వనున్నారు.
ముగిసిన ఏరియల్ సర్వే
మిర్యాలగూడ టౌన్ : మిర్యాలగూడ పట్టణంలో హెలికాప్టర్ సాయంతో చేపట్టిన నక్ష ఏరియల్ సర్వే శనివారం ముగిసింది. శనివారం పట్టణంలోని శివారు ప్రాంతాల్లో శాటిలైట్ ద్వారా గ్రౌండ్ కంట్రోల్ పాయింట్లను గుర్తించారు. ఈ సర్వే జిల్లా సర్వే విభాగం ఏడీ శ్రీనివాస్ పర్యవేక్షణలో చేపట్టారు. త్వరలోనే క్షేత్రస్థాయిలో డ్రోన్ సర్వేను చేపట్టనున్నారు.
మిర్యాలగూడ పెద్ద మసీదు కమిటీ రద్దు
మిర్యాలగూడ : పట్టణంలోని పెద్దబజార్‌లోని పురాతన పెద్ద మసీద్(సారాయే మీరాలం)ను వక్ఫ్‌బోర్డ్ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు ఉన్న మసీదు కమిటీ పదవీకాలం ముగియడంతో కమిటీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ మేరకు కమిటీ రద్దయినట్లు మసీదులో నోటీసు బోర్డుపై అంటించారు. ఈ సందర్భంగా వక్ఫ్‌బోర్డ్ టాస్క్‌ఫోర్స్ ఓఎస్‌డీ మహమ్మద్ ఆసిఫ్‌అలీఖాన్ మాట్లాడుతూ పట్టణంలోని పురాతన పెద్ద మసీదు (సారాయే మీరాలం) కమిటీ పదవీకాలం ముగిసిందన్నారు. ప్రస్తుతం ఎన్నికలు జరిగి కొత్త కమిటీని ఎన్నుకునేంతవరకు మసీదు, దాని ఆధీనంలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్‌లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ మసీదు నిర్వహణ బాధ్యత ప్రత్యేకాధికారిగా వక్ఫ్‌బోర్డ్ ఇన్‌స్పెక్టర్ మహమూద్ వ్యవహరిస్తారని తెలిపారు. త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తామని ఆసక్తిగల వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తామని తెలిపారు. ఇప్పటి నుంచి మసీదు, షాపింగ్ కాంప్లెక్స్ లావాదేవీలన్నీ వక్ఫ్‌బోర్డ్ యాజమాన్యం నిర్వహిస్తుందన్నారు. కార్యక్రమంలో లీగల్ అడ్వయిజర్ మహమ్మద్ ఇమ్రాన్, సర్వేయర్ మహమ్మద్ మాజీద్, ఇన్‌స్పెక్టర్ మహమూద్ పాల్గొన్నారు.
2008 డీఎస్సీ అభ్యర్థులకు పోస్టింగ్
Comments
Please login to add a commentAdd a comment