ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలి
నల్లగొండ: ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు నిరంతరం నిఘా, తనిఖీలు తీవ్రతరం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌తో కలిసి తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మైనింగ్, ఇరిగేషన్, పోలీస్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇసుక రీచ్‌లలో అనుమతించిన వాహనాలు, అనుమతించిన వారికి మాత్రమే ఇసుకను తీసుకువెళ్లే అధికారం ఉందన్నారు. నిబంధనలు అతిక్రమించి అక్రమంగా ఇసుకను రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇసుక రీచ్‌ల వద్ద నైట్ విజన్ కెమెరాలతో పాటు, హైరిజల్యూషన్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యమైన ఇసుక రీచుల వద్ద డ్రోన్ సర్వే సైతం చేయిస్తామన్నారు. పరిమితికి మించి ఇసుకను తవ్వించినా చర్యలు తప్పవన్నారు. జిల్లాలో 24 రీచ్‌లలో ఇసుకను తీసేందుకు అనుమతి ఇవ్వడం జరిగిందని, వాటిని బలోపేతం చేస్తామన్నారు. నది లోతట్టు ప్రాంతాల్లో ఇసుక తవ్వడానికి వీలులేదన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగంగా 31 గ్రామాలకు ఇసుకు రవాణాకు అనుమతులు ఇచ్చామని, ఆయా ఇళ్లకే ఇసుకను మంజూరు చేయాలన్నారు. అనుమతించిన ఇసుక రీచ్‌ల వద్ద, ముఖ్యంగా లోడింగ్ పాయింట్ల వద్ద సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే తవ్వేందుకు అనుమతి ఉంటుందన్నారు. ఆ తర్వాత ఎవరైనా లోడింగ్ పాయింట్ల వద్ద ఇసుకను తవ్వితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎస్పీ శరత్‌చంద్ర పవార్ మాట్లాడుతూ జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు నాలుగు నెలల క్రితమే జాయింట్ టీమ్‌లను ఏర్పాటు చేశామన్నారు. ఈ సమావేశంలో దేవరకొండ ఏసీపీ మౌనిక, అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, జిల్లా మైన్స్ శాఖ సహాయ సంచాలకుడు జాకబ్, హౌసింగ్ పీడీ రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
వేసవిలో తాగునీటి సమస్య రావొద్దు
అనంతరం తహసీల్దార్లు, ఎంపీడీఓలతో వేసవి కార్యాచరణ ప్రణాళికపై జరిగిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ వేసవిలో తాగునీటి సమస్య రాకుండా చూడాలని ఆదేశించారు. ఎక్కడైనా తాగునీటి పైపులు, నల్లాలు తదితర అత్యవసర మరమ్మతులు ఉంటే గ్రామ పంచాయతీ నిధులతో చేయించాలన్నారు. అవసరమున్న గ్రామాల్లో రైతులు వ్యవసాయ బోర్లను అద్దెకు తీసుకుని ప్రజలకు నీరందించాలన్నారు. రానున్న 150 రోజులకు ప్రణాళిక రూపొందించాలన్నారు. అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ మాట్లాడుతూ తాగునీటి సమస్య రాకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో మిషన్ భగీరథ ఈఈ వంశీకృష్ణ, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ తదితరులు పాల్గొన్నారు.
ఫ నిరంతర నిఘా, తనిఖీలు పెంచాలి
ఫ అధికారులను ఆదేశించి
Comments
Please login to add a commentAdd a comment