గత ఎమ్మెల్సీలు టీచర్లను విస్మరించారు
నల్లగొండ : గతంలో పనిచేసిన ఎమ్మెల్సీలు ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించలేదని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. తాను ప్రభుత్వాన్ని ఒప్పించి ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల్లో ప్రముఖ పాత్ర పోషించానని.. తానే అసలైన వామపక్షవాదినని పేర్కొన్నారు. శుక్రవారం నల్లగొండలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఓ ఎమ్మెల్సీ అధికార పార్టీలో చేరి ప్రభుత్వం ఉపాధ్యాయులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నా పట్టించుకోలేదని ఆరోపించారు. వామపక్ష బావజాలం పేరుతో వచ్చిన ఎమ్మెల్సీ ప్రశ్నించే గొంతుకనని చెప్పి.. ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీఓను సమర్థించారని విమర్శించారు. నియోజకవర్గానికి మూడుసార్లు ఎన్నికలు జరిగితే ప్రధాన సంఘాల వారే గెలిచారని ఆ నాయకులు ప్రస్తుతం అటుఇటు మారి పోటీ చేస్తున్నారని పేర్కొన్నారు. గతంలో ఎమ్మెల్సీలు ఏం చేశారో ఉపాధ్యాయులు గమనించాలన్నారు. గత ఎన్నికలప్పుడు చేసిన వాగ్ధానాలే ప్రస్తుతం చేస్తున్నారని విమర్శించారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తాను పనిచేస్తున్నారని చెప్పారు. దశాబ్ద కాలంగా ఉపాధ్యాయ సమస్యలపై పోరాడి 18కిపైగా పోలీసు కేసుల అనుభవిస్తున్నానని.. ఉద్యోగం, పెన్షన్ లేకున్నా ఉద్యమిస్తున్నామని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో సీపీఎస్ రద్దు, 317 పరిష్కారం, ఉమ్మడి సర్వీస్ రూల్స్, హెల్త్‌కార్డులు, పెండింగ్ డీఏలు, మంచి పీఆర్‌సీ సాధనే లక్ష్యంగా పని చేస్తానన్నారు. ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఆలోచించి ఈసారి తనకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో శంకర్, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment