వైభవంగా తిరువీధి సేవ
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ స్వర్ణ విమాన గోపుర మహాకుంభాభిషే సంప్రోక్ష మహోత్సవంలో భాగంగా మూడో రోజు శుక్రవారం ఉదయం శ్రీలక్ష్మీ, నృసింహ దేవతా హవనాలు, హోమాలు, మంటప దేవతారాధన, తిరువీధి సేవ, చతుస్థానార్చన పూజలు నిర్వహించారు. అనంతరం పంచ వింశతి కలశ స్నపనంలో భాగంగా 25 కలశాలల్లో పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చెరకు రసం, కొబ్బరి, ఎర్ర చందనం, కుంకుమ, మారపత్రి నీరు, కదళీ, సర్వ ఔషధి, పుష్పోదకం, ఫలోదకం, గంధోదకం, హోమోదకం, రత్నోదకం, పుణ్యోదకం, సరిత్తోయం తదితర పవిత్ర జలాలను కలశాల్లో నింపి శాస్త్రోక్తంగా పూజలు చేశారు. వీటితో 23వ తేదీన స్వర్ణ విమాన గోపురానికి అభిషేకం చేయనున్నారు. అదే విధంగా మూలమంత్ర, మూర్తిమంత్ర హవనాలు జరిపించి, నిత్య పూర్ణాహుతి, నివేదన, నీరాజన, మంత్ర పుష్పం, శాత్తుమరై నిర్వహించి తీర్థ ప్రసాద గోష్ఠి కార్యక్రమం నిర్వహించారు.
సాయంత్రం చేపట్టిన కార్యక్రమాలు
సాయంత్రం 6గంటలకు శ్రీవిష్ణు సహస్రనామ పారాయణం, ద్వారాది కుంభార్చన, చతుస్థానార్చనలు, మూర్తిమంత్ర హోమాలు, ధాన్యాధివాసం నిర్వహించారు. అనంతరం నిత్య పూర్ణాహుతి, నివేదన, తీర్థ ప్రసాద గోష్ఠి చేసి తిరువీధి సేవను ఆలయంలోకి తీసుకెళ్లారు. శ్రీవానమామలై మఠం 31వ మధుర కవి రామానుజ జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వహించిన వేడుకల్లో ఈఓ భాస్కర్‌రావు, ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, ప్రధానార్చకులు, రుత్వికులు, పారాయణీకులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఫ తిరు, మాడ వీధుల్లో ఊరేగుతూ యాగశాలకు నృసింహుడు
ఫ మూడవ రోజూ కొనసాగిన పంచకుండాత్మక యాగం
వైభవంగా తిరువీధి సేవ
Comments
Please login to add a commentAdd a comment