విద్యుత్ సమస్యలు రాకుండా చూడాలి
నల్లగొండ: వేసవిలో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని టీజీ సీపీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ ఆదేశించారు. గురువారం ఆయన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి నల్లగొండ పట్టణంలోని బీట్‌మార్కెట్‌లో జరుగుతున్న సబ్‌స్టేషన్ పనులను పరిశీలించారు. అనంతరం విద్యుత్ సరఫరాకు సంబంధించి వేసవి కార్యాచరణ ప్రణాళికపై కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతేడాది ఫిబ్రవరి 20 నాటికి జిల్లాలో 66 సబ్ స్టేషన్లపై ఓవర్ లోడ్ ఉండేదని, ఈసారి ఒక్క సబ్‌స్టేషన్ లో కూడా ఓవర్ లోడ్ లేదన్నారు. గత ఫిబ్రవరి చివరి నాటికి జిల్లాలో 966 మెగావాట్ల విద్యుత్ వినియోగం ఉండగా, ఈసారి ఇప్పటికే 1000 మెగావాట్లు దాటిందని, అయినా ఎలాంటి ఓవర్ లోడ్ లేదన్నారు. వ్యవసాయ రంగానికి సంబంధించి మార్చి 15 నాటికి 1,000 మెగావాట్లపైన విద్యుత్ అవసరం ఉండే అవకాశం ఉందని, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. మార్చి 31 వరకు ఎలాంటి సమస్య వచ్చిన ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని, విద్యుత్ అధికారులు అనుమతి లేకుండా కార్యస్థానాన్ని విడిచి వెళ్లొదన్నారు. నెట్‌వర్క్ మీద లోడ్ పెరగకుండా చూడాలని, ఎక్కడైనా బ్రేక్‌డౌన్ అయినా వెంటనే పునరుద్ధరించాలన్నారు. ఇందుకు విద్యుత్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. ఎలాంటి సమస్య ఉన్న జిల్లా కలెక్టర్ లేదా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. బడ్జెట్‌కు ఎలాంటి సమస్య లేదని లైన్లు, ఫీడర్లు, సబ్‌స్టేషన్లన్నింటికీ సహకారం అందిస్తామన్నారు. పలు విషయాలను అడిగితెలుసుకున్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ జిల్లాలో వేసవిలో విద్యుత్ సమస్యను అధిగమించేందుకు ఇదివరకే విద్యుత్ అధికారులతో సమీక్షించామన్నారు. జిల్లాకు తొమ్మిది క్విక్ రెస్పాన్స్ టీం వెహికల్స్ ఇచ్చినందుకు సీఎండీకి కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, విద్యుత్ శాఖ డైరెక్టర్ ఎం.నరసింహ, సీఈ కమర్షియల్ భిక్షపతి, రూరల్ సీఈ బాలకృష్ణ, జిల్లా ఎస్సీ వెంకటేశ్వర్లు, జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ చంద్రమోహన్ పాల్గొన్నారు.
ఫ సీపీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ
Comments
Please login to add a commentAdd a comment