తుది దశకు ‘టెన్త్ ఇంటర్నల్’ మూల్యాంకనం
ఫ 400కుపైగా స్కూళ్లలో ప్రత్యేక బృందాల పరిశీలన
ఫ నేటితో పూర్తికానున్న ప్రక్రియ
ఫ రేపటి నుంచి వెబ్‌సైట్‌లో మార్కుల వివరాలు నమోదు
మూల్యాంకనం కొనసాగుతోంది
జిల్లాలో టెన్త్ విద్యార్థులకు సంబంధించిన ఇంటర్నల్ మార్కుల మూల్యాంకనం కొనసాగుతోంది. ఈ ప్రక్రియ శుక్రవారంతో పూర్తవుతుంది. దీని తర్వాత 22 నుంచి మార్కులను బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషనల్ వెబ్‌సైట్‌లో నమోదు చేస్తాం.
– భిక్షపతి, డీఈఓ, నల్లగొండ
నల్లగొండ: జిల్లాలో పదవ తరగతి ఇంటర్నల్ మార్కుల మూల్యాంకన ప్రక్రియ తుది దశకు చేరింది. ఇంటర్నల్ మార్కుల కోసం ఈ నెల 17 నుంచి మూల్యాంకనం నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగా 400కు పైగా స్కూళ్లలో మూల్యాంకన ప్రక్రియ పూర్తయింది. ప్రతి సబ్జెక్టుకు 100 మార్కులు ఉండగా అందులో 80 మార్కులకు థియరీ పరీక్షల ద్వారా కేటాయిస్తుండగా మిగిలిన 20 మార్కులు ఇంటర్నల్ పరీక్షలు నిర్వహించి మార్కులు కేటాయిస్తారు. జిల్లాలో మొత్తం 485 ప్రభుత్వ, ప్రైవేట్ హైస్కూళ్లు ఉండగా 18,666 మంది విద్యార్థులు టెన్త్ చదువుతున్నారు.
మూల్యాంకనానికి 69 టీమ్‌లు
జిల్లాలో పదవ తరగతి ఇంటర్నల్ మార్కుల పరిశీలనకు జిల్లాలో 69 మానిటరింగ్ బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో ఒక హెచ్‌ఎంతోపాటు సబ్జెక్టు టీచర్, బాషా పండింట్ సభ్యులుగా నియమించారు. ఒక్కో బృందం 5 నుంచి 8 స్కూళ్ల వరకు పర్యవేక్షించి విద్యార్థుల ఇంటర్నల్ మార్కుల జాబితాలు పరిశీలిస్తోంది. ఈ బృందాలు ఎఫ్‌ఏ (ఫార్మటివ్ అసెస్‌మెంట్)–1 నుంచి ఎఫ్‌ఏ– 4 వరకు ప్రతి పాఠ్యాంశానికి నిర్వహించిన పరీక్ష, ప్రాజెక్టు వర్క్, రీడింగ్, రైటింగ్ తదితర వాటికి ఐదు మార్కుల చొప్పున కేటాయిస్తాయి.
నేటితో మూల్యాంకనం పూర్తి
ఈ నెల 17న ప్రారంభమైన ఇంటర్నల్ మార్కుల మూల్యాంకన ప్రక్రియ శుక్రవారం పూర్తి కానుంది. అయితే ఇప్పటికే ఆయా పాఠశాలల క్లాస్ టీచర్ వాటిని పరిశీలించి మార్కులు కేటాయించారు. అయితే ఆయా ఉపాధ్యాయులు సబ్జెక్టుల వారీగా కేటాయించిన మార్కులు సరిగ్గా ఇచ్చారా లేదా అనేది బృందాలు పరిశీలిస్తున్నాయి. ఒకవేళ ఎక్కువ, తక్కువ ఉన్నా సరిచేయాలని సూచిస్తున్నాయి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత విద్యార్థులకు కేటాయించిన మార్కులను 22 నుంచి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషనల్ వెబ్‌సైట్‌లో నమోదు చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment