
ఆఖరి రోజు 110 రిజిస్ట్రేషన్లు
రంజాన్ రోజున కూడా పనిచేసిన సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు
నల్లగొండ : ఎల్‌ఆర్‌ఎస్ డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు సోమవారం కాస్త పెరిగాయి. అనుమతి లేని లేఅవుట్లలో ప్లాట్ల రెగ్యులరైజేషన్‌కు ప్రభుత్వం లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్‌ఆర్‌ఎస్) కింద మార్చి 31వ తేదీవరకు ఫీజు చెల్లించేవారికి 25 శాతం రాయితీ ఇచ్చింది. ఆ అవకాశాన్ని పలువురు సద్వినియోగం చేసుకున్నారు. రంజాన్ పండుగ సెలువు దినం అయినా.. సోమవారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పని చేశాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మార్చి 29వ తేదీవరకు 1,418 ఎల్‌ఆర్‌ఎస్ డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌కాగా.. సోమవారం మాత్రం 110 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. కొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఒక్క డాక్యుమెంట్ కూడా రిజిస్ట్రేషన్ కాకపోవడం గమనార్హం.
ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లింపు..
అనుమతి లేని వెంచర్లు, వ్యవసాయ భూముల్లో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఆ ప్లాట్లను రెగ్యులరైజ్ చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఎల్‌ఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఆయా ప్రాంతాల విలువను బట్టి ఎల్‌ఆర్‌ఎస్ ఫీజులో 25 శాతం రాయితీ ఇచ్చింది. మార్చి 31వ తేదీ వరకు గడువు విధించింది. దీంతో గడిచిన నెల రోజుల నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుదారులు మున్సిపాలిటీ, పంచాయతీల్లో ఆన్‌లైన్ ద్వారా డబ్బులు చెల్లిస్తున్నారు. అయితే గతంలో రిజిస్ట్రేషన్ చేసుకోనివారు.. ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించడంతోపాటు రిజిస్ట్రేషన్లు కూడా చేసుకుంటున్నారు.
ప్రభుత్వానికి ఆదాయం..
ఎల్‌ఆర్‌ఎస్ ఫీజుపై రాయితీ గడువు మార్చి 31వ తేదీతో ముగుస్తుండడంతో ప్రజలు పెద్ద ఎత్తున ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్లు చేసుకుంటారని భావించిన ప్రభుత్వం రంజాన్ సెలవు దినం రోజున కూడా కార్యాలయాలను తెరిచి ఉంచింది. దీంతో సోమవారం ఉమ్మడి జిల్లా పరిధిలో 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 110 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. గడిచిన నెల రోజుల్లో ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించి రెగ్యులరైజ్ చేసుకున్న రిజిస్ట్రేషన్ల కంటే చివరి రోజు కాస్త పెరిగాయి. దీంతో ప్రభుత్వానికి ఒక పక్క ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు ద్వారా, రిజిస్ట్రేషన్ రూపంలో ఆదాయం సమకూరింది.
ఎల్‌ఆర్‌ఎస్ డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ వివరాలు
సబ్ రిజిస్ట్రార్ మార్చి 3వ మొత్తం
కార్యాలయం 29వరకు తేదీన రిజిస్ట్రేషన్లు
భువనగిరి 114 8 152
బీబీనగర్ 132 8 140
చౌటుప్పల్ 25 5 30
మోత్కూర్ 30 0 30
రామన్నపేట 38 6 44
యాదగిరిగుట్ట 225 8 233
చండూరు 23 0 23
దేవరకొండ 72 0 72
మిర్యాలగూడ 81 0 81
నల్లగొండ 68 0 68
నకిరేకల్ 65 48 113
నిడమనూరు 81 4 85
హుజూర్‌నగర్ 26 1 27
కోదాడ 159 1 160
సూర్యాపేట 249 21 270
మొత్తం 1,418 110 1,528
ఫ మార్చి 29వ తేదీ వరకు 1,418 ఎల్‌ఆర్‌ఎస్ డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్
ఫ సాధారణ రోజులతో పోలిస్తే సోమవారం కాస్త ఎక్కువగా..
ఫ నల్లగొండ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో నిల్
ఐదు కార్యాలయాల్లో నిల్..
అయితే సోమవారం ఐదు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఒక్క డాక్యుమెంట్ కూడా రిజిస్ట్రేషన్ కాలేదు. వాటిలో మోత్కూర్, చండూరు, దేవరకొండ, మిర్యాలగూడ, నల్లగొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. చివరి రోజు అధికంగా నకిరేకల్ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో 48 డాక్యుమెంట్లు, సూర్యాపేటలో 21 డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయి.