
మానసిక ఒత్తిడితో కార్మికుడి ఆత్మహత్య
చౌటుప్పల్ రూరల్: మానసిక ఒత్తిడితో ఉరేసుకుని కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన చౌటుప్పల్ మండలం ఎల్లంబావి గ్రామంలో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం పసూనూరు గ్రామానికి చెందిన షేక్ సయ్యద్(50) కుటుంబంతో కలిసి జీవనోపాధి కోసం చౌటుప్పల్ మండలం ఎల్లంబావి గ్రామానికి వలస వచ్చి అద్దె ఇంట్లో నివాసముంటున్నాడు. గత 20ఏళ్లుగా భూదాన్‌పోచంపల్లి మండలం అంతమ్మగూడెం గ్రామ పరిధిలోని ఓ పరిశ్రమలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల పరిశ్రమ యాజమాన్యం పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకు జీతాలు పెంచింది. కానీ సయ్యద్‌కు మాత్రం జీతం పెంచలేదు. దీంతో కొద్దిరోజులుగా మానసిక ఒత్తిడికి గురవుతున్నాడు. శుక్రవారం పరిశ్రమకు వెళ్లిన సయ్యద్ తనకంటే జూనియర్లకు జీతం పెంచి తనకు ఎందుకు పెంచలేదని పరిశ్రమ యాజమాన్యాన్ని అడిగాడు. ‘ఇక్కడ పనిచేస్తే చెయ్.. లేదంటే వెళ్లిపో’ అని పరిశ్రమ యాజమాన్యం అనడంతో ఇంటికి వచ్చి జరిగిన విషయాన్ని భార్యతో చెప్పి బాధపడ్డాడు. సొంతూరికి వెళ్దామని, సామాను సర్దమని భార్యకు చెప్పాడు. శుక్రవారం రాత్రి భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నిద్రించిన సయ్యద్ అర్ధరాత్రి మరొక గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు తాడుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం ఉదయం సయ్యద్ కుమార్తె నిద్ర లేచి చూడగానే తండ్రి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించడంతో తల్లికి చెప్పింది. చుట్టుపక్కల వారు వచ్చి సయ్యద్‌ను కిందికి దించగా అప్పటికే మృతిచెందాడు. తన చావుకు కంపెనీ యాజమాన్యం మరియు శేఖర్ అనే వ్యక్తి కారణమని రాసిన లెటర్ లభ్యమైంది. మృతుడి భార్య షేక్ జానిబీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు.