
వెంటాడిన ఆర్థిక ఇబ్బందులు
రామన్నపేట: పెంచుకున్న రెండు పాడిగేదెలు, రెండు పాడి ఆవులు చనిపోయాయి. సాగుచేసిన వరిపొలం ఎండిపోయింది. పెరిగిన అప్పుల కారణంగా దంపతుల మధ్య వాగ్వాదం నెలకొంది. భర్త ఇంటి నుంచి వెళ్లిపోవడంతో మనస్థాపంతో భార్య ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న భర్త మరుసటిరోజే గడ్డిమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఒక్కరోజు వ్యవధిలోనే దంపతులిద్దరూ ఆత్మహత్య చేసుకోవడంతో చిన్నారులిద్దరూ అనాథలయ్యారు. హృదయ విదారకమైన సంఘటన రామన్నపేట మండలంలోని నిధానపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాలకు చెందిన బొబ్బల మల్లయ్య కుమార్తె కావ్య(25)కు రామన్నపేట మండలం నిధానపల్లి గ్రామానికి చెందిన జినుకల ఆంజనేయులు(31)తో ఏడేళ్ల క్రితం జరిగింది. వారికి నిహాన్, విహాన్ అనే ఇద్దరు ఆరేళ్లలోపు కుమారులు ఉన్నారు. ఆంజనేయులు నిధానపల్లిలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం వారికి చెందిన రెండు పాడిగేదెలు, రెండు పాడి ఆవులు చనిపోయాయి. దాంతో పాటు యాసంగిలో సాగుచేసిన వరిపొలం ఎండిపోయింది. ఆర్థిక సమస్యల కారణంగా ఈనెల 8న భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. అదేరోజు భర్త ఆంజనేయులు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. భర్త ఇంటికి తిరిగి రాకపోవడంతో మనస్థాపానికి గురైన కావ్య గురువారం తమ వ్యవసాయబావి వద్ద పశువుల కొట్టంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భార్య మరణవార్త తెలుసుకున్న ఆంజనేయులు హైదరాబాద్ నుంచి రామన్నపేటకు బయలు దేరాడు. మార్గమధ్యంలో గడ్డిమందు కొనుగోలు చేశాడు. ఇంద్రపాలనగరం శివారులోని అయ్యప్పగుడి సమీపంలో దానిని సేవించాడు. ఈ విషయాన్ని గ్రామస్తులకు ఫోన్‌చేసి తెలిపాడు. దీంతో వారు అక్కడకు వెళ్లి రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రథమ చికిత్స అనంతరం హైదరాబాద్‌కు తరలించారు. నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. మృతుడి తండ్రి సత్తయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మల్లయ్య తెలిపారు. కాగా.. కావ్య, ఆంజనేయులు మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం గ్రామంలో ఒకేసారి అంత్యక్రియలు నిర్వహించారు.
దంపతుల మధ్య గొడవతో
ఇంటి నుంచి వెళ్లిపోయిన భర్త
మనస్తాపంతో
ఆత్మహత్య చేసుకున్న భార్య
విషయం తెలుసుకుని గడ్డిమందు
తాగి బలవన్మరణానికి పాల్పడ్డ భర్త
తల్లిదండ్రుల మృతితో అనాథలైన చిన్నారులు
అనాథలైన చిన్నారులు
తల్లిదండ్రులిద్దరూ ఆత్మహత్య చేసుకోవడంతో వారి కుమారులు నిహాన్, విహాన్‌లు అనాథలయ్యారు. అంత్యక్రియల సమయంలో అక్కడ ఏం జరుగుతుందో తెలియక ధీనంగా చూస్తూ ఉండిపోయారు. చిన్నారుల చూసి బంధువులు, గ్రామస్తులు కంటతడి పెట్టారు. హృదయ విదారకమైన సంఘటనతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

వెంటాడిన ఆర్థిక ఇబ్బందులు

వెంటాడిన ఆర్థిక ఇబ్బందులు