
విద్యుత్ తీగలు తగిలి గడ్డి దగ్ధం
యాదగిరిగుట్ట రూరల్: విద్యుత్ తీగలు తగిలి ట్రాక్టర్‌లో తీసుకెళ్తున్న గడ్డి దగ్ధమైంది. ఈ ఘటన యాదగిరిగుట్ట మండలం బాహుపేట గ్రామంలో ఆదివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మోటకొండూర్ మండలం తేరాల గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ నల్ల అరుణ్ ఆదివారం 130కట్టల గడ్డిని తన ట్రాక్టర్‌లో లోడు చేసుకుని తేరాల గ్రామం నుంచి వయా ఆలేరు, బాహుపేట మీదుగా పెద్దకందుకూరు గ్రామానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో బాహుపేట గ్రామానికి రాగానే విద్యుత్ తీగలు గడ్డి కట్టలకు తాకడంతో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు పెద్దవి కావడంతో డ్రైవర్ అరుణ్ ట్రాక్టర్‌పై నుంచి కిందకు దూకాడు. ట్రాక్టర్ రోడ్డు పక్కన ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. వెంటనే స్థానికుల సహాయంతో హుటాహుటిన చెరువులోని నీళ్లతో గడ్డికి అంటుకున్న మంటలను ఆర్పుతూ, జేసీబీ సహాయంతో దగ్ధమవుతున్న గడ్డిని కిందపడేశారు. అరుణ్‌కు స్వల్ప గాయాలు కావడంతో ఆలేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు.
నాలుగు టీంలతో గాలింపు
నల్లగొండ: నల్లగొండలో సంచలనం సృష్టించిన మణికంఠ ఫొటో కలర్ ల్యాబ్ యజమాని గద్దపాటి సురేష్ హత్య కేసు విచారణ కొనసాగుతోంది. ఎస్పీ శరత్‌చంద్ర పవార్ నిందితులను పట్టుకునేందుకు నాలుగు టీంలను ఏర్పాటు చేయగా.. ఆ టీంలు గాలింపు చర్యలు చేపట్టాయి. టూటౌన్ పోలీసులు అనుమానితులతో పాటు హత్యకు ముందు మృతుడితో ఫోన్‌లో మాట్లాడిన వారిని కూడా విచారిస్తున్నట్లు సమాచారం.