పరిశోధనకు మూలం ప్రశ్నావళి | - | Sakshi
Sakshi News home page

పరిశోధనకు మూలం ప్రశ్నావళి

Published Sun, Apr 20 2025 1:54 AM | Last Updated on Sun, Apr 20 2025 1:54 AM

పరిశోధనకు మూలం ప్రశ్నావళి

పరిశోధనకు మూలం ప్రశ్నావళి

నల్లగొండ టూటౌన్‌: పరిశోధనకు మూలం ప్రశ్నావళి తయారీ అని ఐపీఈ ప్రొఫెసర్‌ వై. రామకృష్ణ అన్నారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీలో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆధ్వర్యంలో శని వారం నిర్వహించిన ‘అకడమిక్‌ రైటింగ్‌ ఫర్‌ పీహెచ్‌డీ స్కాలర్స్‌ అండ్‌ యంగ్‌ టీచర్స్‌’ వర్క్‌షాప్‌లో ఆయన పాల్గొని డేటా కలెక్షన్‌, ఎనాలసిస్‌ అండ్‌ ఇంటర్‌ప్రిటేషన్‌ టూల్స్‌ అండ్‌ టెక్నిక్స్‌ అనే అంశాలపై విద్యార్థులకు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీహెచ్‌డీ చేసే విద్యార్థులు డేటా కలెక్షన్‌కు వెళ్లే ముందు ప్రశ్నావళి తయారు చేయడంలో ఉపయోగించే స్కేల్స్‌ తో పాటు వాటిని ఎనాలసిస్‌ చేయడానికి ఉపయోగించే ఎక్సెల్‌ షీట్‌పై దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఓయూ గ్రంథాలయ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ చక్రవర్తి, ఎంజీయూ ప్రొఫెసర్‌ అంజిరెడ్డి, ఆకుల రవి, శ్రీదేవి, రవిచంద్ర, పీహెచ్‌డీ స్కాలర్స్‌ తదితరులు పాల్గొన్నారు.

యాదగిరీశుడికి వెండి కలశాలు బహూకరణ

యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామికి శనివారం హైదరాబాద్‌కు చెందిన భక్తులు వెండి కలశాలు, వెండి పాత్రలు బహూకరించారు. హైదరాబాద్‌లోని మాసబ్‌ ట్యాంక్‌కు చెందిన బిరదవోలు వరశ్రీ కుటుంబ సభ్యులు సుమారు 7కిలోల వెండితో తయారు చేసిన 11 వెండి కలశాలు, ఒక ఏక హారతి, ఒక ధూప హారతి పాత్రలను ఈఓ భాస్కర్‌రావుకు అందజేశారు. అదేవిధంగా హైదరాబాద్‌కే చెందిన డాక్టర్‌ బీవీఎస్‌ రాంప్రసాద్‌ కిలో వెండితో తయారుచేసిన 2 వెండి కలశాలను ఈఓకు అందించారు. అంతకుముందు వారు గర్భాలయంలో స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

వరి పంట కోయనీయడంలేదని ఆత్మహత్య

నాగారం: వరి పంట కోయనీయకుండా అడ్డుకోవడంతో మనస్తాపానికి గురైన మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నాగారం మండలం ఫణిగిరి గ్రామంలో శనివారం జరిగింది. పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫణిగిరి గ్రామానికి చెందిన వట్టె భద్రమ్మ(61), ముత్తయ్య దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. వీరికి ఏడెకరాల వ్యవసాయ భూమి ఉంది. పెద్ద కుమారుడు 20ఏళ్ల క్రితమే మృతి చెందాడు. భర్త మృతిచెందిన తర్వాత పెద్ద కోడలు విజయ తన పుట్టింటికి వెళ్లి జీవనం కొనసాగిస్తోంది. దీంతో భద్రమ్మ తన మనవరాలు(విజయ కుమార్తె) పేరిట రూ.10లక్షల విలువైన ఇంటి స్థలం, రెండెకరాల పొలం రాసిచ్చింది. అయితే తన భర్త వాటా కింద రావాల్సిన మిగతా ఎకరంన్నర పొలం తమ పేరిట రాసివ్వాలని విజయ పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టింది. అంతేకాకుండా ఆ ఎకరంన్నరలో పండించిన వరిని కోయనీయకుండా అడ్డుకోవడంతో మనస్తాపం చెందిన భద్రమ్మ శనివారం వ్యవసాయ బావి వద్ద పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి చిన్న కుమారుడు పుల్లయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు డాగ్‌ స్క్వాడ్‌, క్లూస్‌టీంతో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రఘువీర్‌రెడ్డి తెలిపారు.

ఈతకు వెళ్లి బావిలో బాలుడు గల్లంతు

సూర్యాపేటటౌన్‌: ఈత కొట్టేందుకు వెళ్లిన బాలుడు బావిలో గల్లంతయ్యాడు. ఈ ఘటన శనివారం సూర్యాపేట మండలం కేసారం గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేసారం గ్రామానికి చెందిన పల్లె వెంకన్న, లలిత దంపతుల కుమారుడు మహేందర్‌(11)తో పాటు అతడి స్నేహితులు వేణు, అభిలాష్‌, దినేష్‌ ఈత కొట్టేందుకు గ్రామ శివారులోని బావి వద్దకు వెళ్లారు. దినేష్‌ బావి ఒడ్డున కూర్చొని ఉండగా మిగిలిన ముగ్గురు బావిలోకి దూకారు. మహేందర్‌, వేణుకు ఈత రాకపోవడంతో మునిగిపోతుండగా బావిలో ఉన్న అభిలాష్‌ వారి ఇద్దరిని కాపాడే ప్రయత్నం చేశాడు. అయితే మొదట వేణును బయటకు తీసుకొచ్చి వెంటనే మహేందర్‌ను కాపాడేందుకు ప్రయత్నం చేయగా అప్పటికే అతడు బావిలో మునిగిపోయాడు. బావి లోతుగా ఉండటంతో కాపాడలేకపోయాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రూరల్‌ ఎస్‌ఐ బాలునాయక్‌, తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. రెండు చైనా మోటార్లు, రెండు ట్రాక్టర్‌ మోటార్లతో నీటిని తోడుతున్నారు. శనివారం అర్ధరాత్రి వరకు బాలుడి ఆచూకీ తెలిసే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement