
గులాబీ దండు వరంగల్ బాట
బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు తరలివెళ్లేందుకు సన్నద్ధం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: వరంగల్‌లో ఆదివారం జరిగే బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు వెళ్లేందుకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు సన్నద్ధ్దమయ్యాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల నేతృత్వంలో బస్సులు, కార్లు, జీపులలో ఆదివారం ఉదయమే తరలివెళ్లనున్నారు. వరంగల్ జిల్లాకు దగ్గరగా ఉన్న నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున జనాలు తరలించేందుకు నాయకులు ఏర్పాట్లు చేశారు. అన్ని గ్రామాల్లో ఆదివారం ఉదయం జెండాలు ఆవిష్కరించి సభకు బయలుదేరుతారు.
వినూత్న రీతిలో..
వరంగల్ సభకు ఉమ్మడి నల్లగొండ నుంచి లక్ష మందిని తరలించేలా టార్గెట్ పెట్టుకున్నారు. అందులో సూర్యాపేట, తుంగతుర్తి, ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల నుంచే సగం మంది ప్రజలు, రైతులు హాజరయ్యేలా ఏర్పాట్లు చేయాలని గతంలోనే బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆదేశించారు. సూర్యాపేట నుంచి మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో జనం తరలించేందుకు చర్యలు చేపట్టారు. సూర్యాపేట నియోజకవర్గం నుంచి వినూత్న రీతిలో ఎడ్ల బండ్లలో ఈ నెల 22న పార్టీ శ్రేణులు వెళ్లగా, శుక్రవారం సైకిళ్లపై కూడా తరలివెళ్లారు. ఆదివారం ఉదయం వెళ్లేందుకు వందకు పైగా డీసీఎంలు, మరో వంద వరకు బస్సులు, వందల సంఖ్యలో అద్దె కార్లు, సొంత కార్లలో వెళ్లనున్నారు.
అద్దె వాహనాలను బుక్ చేసుకొని..
తుంగతుర్తి నియోజకవర్గం నుంచి 13,500 మందిని బీఆర్‌ఎస్ సభకు తరలించాలని నిర్ణయించి అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేశారు. అద్దె వాహనాలను బుక్ చేసుకొని మరీ సభకు తరలివెళ్లేందుకు సిద్ధమయ్యారు. మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఆధ్వర్యంలో 135 డీసీఎంలు, 100 బొలేరోలు, 20 బస్సులు, తూపాన్ వాహనాల్లో వెళ్లేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే సభ విజయవంతానికి మండలాల్లో సభలు నిర్వహించి పార్టీ శ్రేణులను సన్నద్ధం చేశారు.
భువనగిరి నియోజకవర్గం నుంచి...
భువనగిరి నియోజకవర్గం నుంచి 15 వేల మందిని తరలించేందుకు మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఏర్పాట్లు చేశారు. 200 బస్సులతో పాటు 150 వరకు కార్లు ఏర్పాటు చేశారు. రెండు గ్రామాలకు ఒక బస్సు చొప్పున వెళ్లనున్నాయి. ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలు, అభిమానులు తరలివెళ్లేలా సన్నద్ధ్దం చేశారు. పార్టీ నాయకుడు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి కూడా సభకు పార్టీ కార్యకర్తలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆలేరులో గ్రామానికో బస్సు..
ఆలేరు నియోజకవర్గం నుంచి ప్రతి గ్రామానికి ఒక బస్సు పెట్టారు. కార్లు కూడా ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేశారు. వరంగల్‌కు దగ్గరగా ఉన్నందున ఆ నియోజకవర్గం నుంచే పెద్ద ఎత్తున జనాలను సమీకరిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునిత, డీసీసీబీ మాజీ చైర్మన్ మహేందర్‌రెడ్డి, బూడిద బిక్షమయ్యగౌడ్ ఆధ్వర్యంలో 15వేల మంది వరకు తరలించనున్నారు.
ఫ ఉమ్మడి జిల్లా నుంచి బస్సులు, కార్లు, సొంత వాహనాల్లో ఓరుగల్లుకు..
ఫ మాజీ ఎమ్మెల్యేల నేతృత్వంలో నియోజకవర్గాల్లో ఏర్పాట్లు
ఫ సూర్యాపేట, తుంగతుర్తి, భువనగిరి, ఆలేరు నుంచే ఎక్కువ మంది..
ఫ ఇప్పటికే సూర్యాపేట నుంచి ఎడ్లబడ్లపై వెళ్లిన రైతులు, పార్టీ శ్రేణులు