ఎగ్జిట్‌ ఉత్కంఠ | - | Sakshi
Sakshi News home page

ఎగ్జిట్‌ ఉత్కంఠ

Published Sat, Jun 1 2024 8:00 AM | Last Updated on Sat, Jun 1 2024 10:10 AM

No Headline

No Headline

దేశ వ్యాప్తంగా సార్వత్రిక పోరులో చివరిదశ పోలింగ్‌ నేడే

6 గంటలకు ముగియనున్న పోలింగ్‌

ఆపై ఎగ్జిట్‌పోల్స్‌ను ప్రకటించనున్న సర్వే సంస్థలు

ఎగ్జిట్‌పోల్స్‌ కోసం ప్రజలతో పాటు రాజకీయపార్టీలు,నేతలూ ఎదురుచూపులు

ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో జోరుగాబెట్టింగ్‌లు

ఎగ్జిట్‌పోల్స్‌ తర్వాత మరింత జోరందుకోనున్న బెట్టింగ్‌లు

ఈ నెల 4న కౌంటింగ్‌తో తేలనున్న అభ్యర్థుల భవితవ్యం

సార్వత్రిక సమరం చివరి అంకానికి చేరుకుంది. మన రాష్ట్రంలో నాలుగో విడతలో భాగంగా మే 13న పోలింగ్‌ ముగిసినా దేశ వ్యాప్తంగా పార్లమెంట్‌ స్థానాలకు మరో మూడు దశల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. దీంతో సర్వే సంస్థలు, టీవీ ఛానెళ్లు ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకటించలేదు. చివరిదశ పోలింగ్‌ నేడు(శనివారం) ముగియనుంది. సాయంత్రం 6గంటలకు పోలింగ్‌ ముగుస్తుంది. దీంతో 6.30 గంటల తర్వాత ఎగ్జిట్‌పోల్స్‌ను సర్వే సంస్థలు వెల్లడించనున్నాయి. దీని కోసం బెట్టింగ్‌ రాయుళ్లు, రాజకీయపార్టీల నేతలు, ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కౌంటింగ్‌ నాలుగో తేదీన ఉన్నప్పటికీ ఎగ్జిట్‌పోల్స్‌తో గెలుపోటములపై ఓ అంచనా వచ్చే అవకాశం ఉంది. దీంతో అందరిలోనూ ‘ఎగ్జిట్‌’ ఉత్కంఠ నెలకొంది. – 

సాక్షిప్రతినిధి కర్నూలు: సార్వత్రిక సమరంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 అసెంబ్లీ, 2 పార్లమెంట్‌ స్థానాలకు ఈ నెల 13న పోలింగ్‌ జరిగింది. పోలింగ్‌, కౌంటింగ్‌కు 22 రోజులు గడువుంది. ఈ మధ్యలో జిల్లాలో జోరుగా బెట్టింగ్‌లు జరిగాయి. 14 అసెంబ్లీలలో అభ్యర్థుల విజయావకాశాలను బట్టి అభ్యర్థులు ఎవరికివారు లెక్కలు వేసుకుని ఎవరి అంచనాల్లో వారు ఉన్నారు. కొంతమంది పోలింగ్‌రోజే ఎగ్జిట్‌పోల్స్‌ చేయించారు. మరికొందరు పోలింగ్‌ ముగిసి తర్వాత పోలింగ్‌బూత్‌ల వారీగా ఏజెంట్లు, ముఖ్యనేతలను పిలిపించుకుని బూత్‌ల వారీగా ఎన్ని ఓట్లు పోలై ఉంటాయనే లెక్కలు వేసుకున్నారు. ఆపై అభ్యర్థులు, ముఖ్యనేతలు వారి పరిధిలో పరిచయం ఉన్న మీడియా ప్రతినిధులు, సర్వేసంస్థల ప్రతినిధులను కలిసి ఓ అంచనాకు వచ్చారు. దీని ప్రకారం బెట్టింగ్‌లు కాశారు.

ఉమ్మడి జిల్లాలో రూ. వంద కోట్లకుపైగా బెట్టింగ్‌లు
అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాలపై గతంలో ఏ ఎన్నికల్లో లేని విధంగా బెట్టింగ్‌లు నడిచాయి. గత నాలుగు ఎన్నికల ఫలితాలు, ఈ దఫా జరిగిన పోలింగ్‌ను బట్టి రెండు పార్లమెంట్‌ స్థానాలతో పాటు 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో అత్యధిక స్థానాలు వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ కై వసం చేసుకుంటుందనే అభిప్రాయం ప్రజలతో పాటు రాజకీయపార్టీల్లో కూడా స్పష్టత ఉంది. అయితే ఏ అసెంబ్లీ వైఎస్సార్‌సీపీ గెలుస్తుంది? ఎక్కడ టీడీపీ గెలుస్తుందనే అంశంలోనే అందరిలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ అంశమే బెట్టింగ్‌లు భారీగా కాసేందుకు ప్రభావం చూపింది. 

ఫలానా అసెంబ్లీ స్థానాన్ని వైఎస్సార్‌సీపీ గెలుస్తుందంటే, లేదు అక్కడ టీడీపీ గెలిచే అవకాశం ఉందని బెట్టింగ్‌లకు సిద్ధమయ్యారు. బెట్టింగ్‌లు చాలా రకాలుగా జరిగాయి. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది? ఏ ఎమ్మెల్యే గెలుస్తాడు? ఎంత మెజార్టీతో గెలుస్తారు? ఉమ్మడి జిల్లాలో ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలుస్తుంది? ఇలా రకరకాలుగా బెట్టింగ్‌లు కాశారు. మెజార్టీ వ్యక్తులు వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తుందని, మెజార్టీ స్థానాలు వైఎస్సార్‌సీపీ గెలుస్తుందని బెట్టింగ్‌ నిర్వహించారు. అప్పటి వరకూ 1:1 లెక్కన బెట్టింగ్‌ జరిగింది. పల్లెల్లో రూ.50వేలు, లక్ష నుంచి ఓ స్థాయి నాయకులు రూ.10లక్షలు, రూ.50లక్షలు బెట్టింగ్‌ కాశారు. మరికొందరు గుంపుగా ఏర్పడి రూ.కోటి, 2కోట్లు కూడా బెట్టింగ్‌ కాశారు.

సీఎం వ్యాఖ్యల తర్వాత మారిన తీరు
పోలింగ్‌ ముగిసిన తర్వాత తిరిగి వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాబోతోందని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్‌ చేశారు. ఆపై నాలుగురోజులకు 151 అసెంబ్లీ, 22 పార్లమెంట్‌ల కంటే అధిక స్థానాలు గెలువబోతున్నామని ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు. ఇదే అందరిలోనూ గుబులు రేకిత్తించింది. పక్కా సమాచారం లేకుండా సీఎం వ్యాఖ్యానించరని, కచ్చితమైన రిపోర్టులతోనే ఈ ప్రకటన చేశారని అంతా భావించారు. ఈ ప్రకటనల తర్వాత చాలామంది బెట్టింగ్‌లు వెనక్కి తీసుకున్నారు. అయితే తర్వాత నాలుగైదురోజులకు బెట్టింగ్‌ నిర్వాహకులు వైఎస్సార్‌సీపీ, టీడీపీ మధ్య 1:2, 1:3 లెక్కల బెట్టింగ్‌ నిర్వహించారు. ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపు అంశంలోనూ ఈ రకమైన పందమే జరిగింది. 

దీంతో చాలామంది టీడీపీ నేతలు, బెట్టింగ్‌రాయుళ్లు పోతే ఒకటే, గెలిస్తే 2, 3 రెట్లు డబ్బు వస్తుందని పందెం కాశారు. దీంతో తిరిగి పందేలు ఊపందుకుని రూ.100 కోట్లకుపైగా జరిగి ఉంటాయని తెలుస్తోంది. కొందరు పొలాలు, స్థలాలు కూడా పందెం కాశారు. మరి కొంతమంది యువకులు విదేశీపర్యటనల ఖర్చును బెట్టింగ్‌ కాశారు. అయితే నగదుపై జరిగిన బెట్టింగ్‌ ఎక్కువగా ప్రొద్దుటూరు, విజయవాడ, గుంటూరుతో పాటు తూర్పు, పశ్చిమ గోదావారి ప్రాంతంలోని వ్యక్తులు మధ్యవర్తులుగా వ్యవహరించారు. వీరితో పాటు హైదరాబాద్‌ కేంద్రంగా కూడా ఇక్కడి వ్యక్తులు బెట్టింగ్‌ కాచారు. రెండువైపుల నగదును హైదరాబాద్‌లోని మధ్యవర్తులకు ఇచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement