రెగ్యులర్ సీఈగా కబీర్ బాషా
కర్నూలు (సిటీ): జలవనరుల శాఖలో మరోసారి అడ్‌హక్ పదోన్నతులు కల్పించారు. కర్నూలు ప్రాజెక్ట్స్ ఇన్‌చార్జ్ సీఈగా పనిచేస్తున్న షేక్ కబీర్ బాషాకు పదోన్నతి కల్పించి రెగ్యులర్ సీఈగా నియమించారు. ఈయన ఎస్‌ఆర్‌బీసీ సర్కిల్–1 పర్యవేక్షక ఇంజినీర్‌గా పనిచేస్తూనే 2022 జులై 4వ తేదీ నుంచి ఇన్‌చార్జ్ సీఈగా పనిచేస్తున్నారు. హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం పర్యవేక్షక ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఎంఎల్‌వీ వరప్రసాద్‌ను తెలుగుగంగ తిరుపతి చీఫ్ ఇంజినీర్‌గా నియమించారు.
8న జాతీయ లోక్ అదాలత్
కర్నూలు(సెంట్రల్): కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని వివిధ కోర్టుల్లో పెండింగ్‌లోని కేసుల పరిష్కారానికి ఈనెల 8న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి.కబర్థి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జస్టిస్ పి.లీలా వెంకట శేషాద్రి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. జాతీయ లోక్ అదాలత్‌లో న్యాయ స్థానాల్లో పెండింగ్ ఉండి రాజీ పడేందుకు సిద్ధంగా ఉన్న సివిల్, క్రిమినల్, ప్రీలిటిగేషన్ కేసులను పరిష్కరించుకోవాలని బాధితులకు సూచించారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
క్యాన్సర్ చికిత్సకు
లీనాక్ మిషన్ ప్రారంభం
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఆవరణలో ఉన్న స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో క్యాన్సర్ చికిత్సలో భాగమైన లీనాక్ మిషన్‌ను బుధవారం మెడికల్ కాలేజి ప్రిన్సిపల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్టేట్ క్యాన్సర్ హాస్పిటల్‌లో 80 శాతం వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఇప్పటికే ఓపీ సేవలు, ఇన్‌పేషెంట్ సేవలు అందుబాటులోకి వచ్చాయని, మరికొన్ని ఆపరేషన్ థియేటర్ పరికరాలు రావాల్సి ఉందన్నారు. అవి వచ్చిన వెంటనే త్వరలో ఆపరేషన్ థియేటర్ సేవలు కూడా ప్రజలకు అందుబాటులోకి వస్తాయన్నారు. కార్యక్రమంలో హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ సీఎస్‌కే ప్రకాష్, సీఎస్‌ఆర్‌ఎంఓ డాక్టర్ హేమనళిని పాల్గొన్నారు.
మహానందిలో
మోగనున్న కల్యాణ వీణ
మహానంది: ప్రముఖ క్షేత్రమైన మహానందిలో గురు, శుక్రవారాల్లో అధికంగా వివాహాలు జరగనున్నాయి. ఈ నెలలో 16వ తేదీ వరకు మంచి ముహూర్తాలు ఉండటంతో వివాహాలు చేసుకునేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో మహానందిలో గురువారంతో పాటు ఈ నెల 15,16వ తేదీల్లో వివాహాలు జరగనున్నట్లు అర్చకులు, నిర్వాహకులు తెలిపారు. గురువారం ఒక్కరోజే సుమారు 15 పైగా వివాహాలు జరగనున్నాయి. ఇప్పటికే ఆలయ ప్రాంగణంలోని టీటీడీ కల్యాణమండపంతో పాటు నాగనంది, టీటీడీ వసతి గృహాలు, ప్రైవేటు కల్యాణమండపాలు బుక్ చేసుకున్నారు.
యువకుడి దుర్మరణం
ఆత్మకూరురూరల్: రోడ్డు ప్రమాదంలో సతీష్(25) అనే యువకుడు మృతి చెందాడు. ఈ దుర్ఘటన ఆత్మకూరు పట్టణంలోని పాత ఫారెస్ట్ ఠాణా సమీపంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఆత్మకూరు పట్టణంలోని గొల్లపేటకు చెందిన సతీష్ తన ద్విచక్రవాహనంపై కేజీ రోడ్డులోని ఠాణా వద్ద వెళ్తున్నాడు. ఆర్టీసీ బస్సును ఓవర్‌టేక్ చేసే ప్రయత్నం చేయగా అదే సమయంలో ఒక బొలేరో వాహనం కూడా బస్సును ఓవర్‌టేక్ చేయబోయింది. దీంతో బస్సు – బొలేరో వాహనం మధ్యలో ఇరుక్కు పోయిన సతీష్ అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
రెగ్యులర్ సీఈగా కబీర్ బాషా
Comments
Please login to add a commentAdd a comment