
ఎన్నికలకు ముందు సామాన్యులకు ఇసుక అందుబాటులో ఉండేవిధంగా
● ఇసుక వ్యాపారులుగా టీడీపీ నేతలు
● ఆళ్లగడ్డలో పేరుకే స్టాక్ పాయింట్
● జమ్మలమడుగు నుంచి పెద్దముడియం
మీదుగా అక్రమంగా తరలింపు
● ట్రాక్టర్‌కు రూ. 2 వేలు అదనం
● ఓ ప్రజాప్రతినిధి భర్త
కనుసన్నల్లో దందా
రోజుకు రూ. లక్షల్లో అక్రమ ఆదాయం
నియోజకవర్గ వ్యాప్తంగా ఇసుక కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇసుక కావాలంటే తప్పనిసరిగా టీడీపీ నాయకులను ఆశ్రయించాల్సిందే. ట్రాక్టర్ ఇసుకకు అదనంగా రూ.2 వేలు ఇస్తేనే సరఫరా చేస్తున్నారు. చాగలమర్రి, రుద్రవరం, ఆళ్లగడ్డ, దొర్నిపాడు, ఉయ్యాలవాడ, శిరివెళ్ల మండలాలకు ప్రతి రోజు 120 నుంచి 150 ట్రాక్టర్ల ఇసుక సరఫరా అవుతోంది. రోజుకు కేవలం ఇసుక ద్వారానే అక్రమంగా రూ.3 లక్షలు సంపాదిస్తున్నారు. ఈ మొత్తం అంతా స్థానిక ప్రజాప్రతినిధి భర్త జేబులోకి వెళ్తోందని ప్రచారం జరుగుతోంది. ఇసుక అక్రమ రవాణా మూడు పువ్వులు.. ఆరు కాయలుగా విరాజిల్లుతున్నా పోలీసు, రెవెన్యూ అధికారులు కన్నెత్తి చూడడకపోవడం గమనార్హం.
సాక్షి, నంద్యాల: కూటమి నేతలకు ఇసుక కాసులు కురిపిస్తోంది. పేరుకే ఉచిత ఇసుక.. కానీ, కాసులిస్తే కానీ టన్ను ఇసుక దొరకని పరిస్థితి. ప్రభుత్వం ఆర్భాటంగా ఏర్పాటు చేసిన ఇసుక స్టాక్ పాయింట్లను మూసేసి అక్రమార్జనకు తెరలేపారు. అక్రమ మార్గంలో ఇసుకను తరలిస్తూ రూ. కోట్లు కూడబెడుతున్నారు. ఇప్పటికే పెరిగిన ఖర్చులతో నిర్మాణ రంగం కుదేలయింది. సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఒక్కో ట్రాక్టర్ మీద రూ.2 వేలు వసూలు చేస్తూ మరింత భారం మోపుతున్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గానికి వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నుంచి ఇసుకను తరలిస్తున్నారు. పెద్దముడియం మీదుగా ఆళ్లగడ్డకు... ఇక్కడి నుంచి రుద్రవరం, దొర్నిపాడు, ఉయ్యాలవాడ, శిరివెళ్ల, చాగలమర్రి మండలాలకు వెళ్తోంది. ప్రతి రోజు రాత్రి మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్య అక్రమ రవాణా సాగుతోంది. ఇసుక కావాలనుకున్న వారు టీడీపీ నాయకులను సంప్రదిస్తే వారే ఇసుక తెప్పిస్తున్నారు. నాలుగు టన్నుల ఇసుక ట్రాక్టర్ రవాణా ఖర్చులతో కలిపి రూ.3500కు విక్రయించాల్సి ఉండగా.. టీడీపీ నాయకుల అక్రమ వసూళ్లతో ఇసుక ట్రాక్టర్ రూ.6 వేల వరకు పలుకుతోంది. అక్రమ దందాతో ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నా జిల్లా ఇసుక కమిటీ చైర్ పర్సన్‌గా ఉన్న కలెక్టర్ రాజకుమారి గణియా ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.
స్టాక్ పాయింట్ తెరిస్తే ఒట్టు..
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ప్రజలకు అందుబాటులోనే ఇసుక స్టాక్ పాయింట్ ఏర్పాటు చేశారు. పట్టణంలోని మార్కెట్ యార్డ్‌లో ఇసుక నిల్వ ఉంచి కావాల్సిన వారు సులువుగా బుక్ చేసుకుని తీసుకుని వెళ్లే సౌలభ్యం ఉండేది. కానీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇసుకను ప్రధాన ఆదాయ వనరుగా మలుచుకున్నారు. స్థానికంగా ఇసుక లభ్యత లేకపోవడం వీరికి కలిసొచ్చింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్టాక్ పాయింట్‌ను ఇప్పటి వరకు తెరవలేదు. గత నవంబర్‌లో ఇసుక స్టాక్ యార్డ్‌లకు టెండర్లు పిలిచి అదే నెలలో డీలర్ లైసెన్స్‌లను ఖరారు చేశారు.
ప్రభుత్వం నిర్ణయించింది
రూ.719 మాత్రమే...
రాష్ట్ర ప్రభుత్వం టన్ను ఇసుక ధర రూ.719 చొప్పున నిర్ణయించింది. ఇసుక ఎవరికి కావాలన్నా అధికారికంగా ఈ ధర చెల్లించి తీసుకెళ్లవచ్చు. కానీ, ఆళ్లగడ్డలో మాత్రం పేరుకే ఇసుక స్టాక్ పాయింట్ ఉంది. అక్కడికి వెళ్లి చూస్తే ఇసుక ఉండదు.. ఇసుక స్టాక్ పాయింట్ ఎప్పుడూ మూత వేసి ఉంచుతున్నారు. పట్టణానికి 4 కిలో మీటర్ల దూరంలో పాలసాగరం వద్ద ఏర్పాటు చేశారు. స్టాక్ యార్డ్ ఏర్పాటై నాలుగు నెలలవుతున్నా ప్రజలకు స్టాక్ యార్డ్ ఎక్కడ ఉందో తెలియదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఎన్నికలకు ముందు సామాన్యులకు ఇసుక అందుబాటులో ఉండేవిధంగా