
● జిల్లా కలెక్టర్ రాజకుమారి
ప్రైవేట్ భూములు
మార్పు చేయొద్దు
నంద్యాల: ప్రైవేట్ భూములను 22(ఎ) కింద మార్పులు చేస్తే సంబంధిత తహసీల్దార్లపై చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి హెచ్చరించారు. అదే విధంగా వెబ్‌ల్యాండ్‌లో ఒకరి పేరుకు బదులు ఇంకొకరి పేరు మీద అనుచితంగా మార్పులు చేర్పులు చేస్తే అధికారులపై చర్యలు తప్పవన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని పీజేఆర్‌ఎస్ హాలులో రెవెన్యూ, రీసర్వే అంశాలపై రెవెన్యూ సిబ్బందికి జిల్లా కలెక్టర్ వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమానికి ఇన్‌చార్జ్ జాయింట్ కలెక్టర్ రామునాయక్, నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్, ఆత్మకూరు ఆర్డీఓ అరుణజ్యోతి, డోన్ ఆర్డీఓ నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ.. ఫ్రీ హోల్డ్ భూములు, రీ సర్వే, 22ఏ, జాతీయ రహదారుల భూ సేకరణ తదితర రెవెన్యూకు సంబంధించిన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రెవెన్యూ అంశాలపై రెవెన్యూ సిబ్బందికి పూర్తి అవగాహన ఉండాలన్నారు. జిల్లాలో వివిధ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ భూములు గుర్తించడంలో రెవెన్యూ అధికారులు తాత్సారం చేస్తున్నారన్నారు. నంద్యాల జిల్లాలో సుమారు 5 లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయని, వీటిపై తహసీల్దార్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. భూముల విస్తీర్ణం, సంబంధిత భూములు ఏ సర్వే నంబరులో ఉందో తెలుసుకోవడానికి ఇన్వెంటర్ రిజిష్టర్లు నిర్వహించాలన్నారు. గుజరాత్ రాష్ట్రంలో ఒక్క సెంటు ప్రభుత్వ భూమి ఉన్న కూడా వారు గుర్తించి ఆన్‌లైన్‌లో నమోదు చేయడంతో ఎక్కువ శాతం పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం వచ్చిందన్నారు.